90ల్లో పుట్టిన వాళ్లు నిజ్జంగానే అదృష్టవంతులు. వాళ్లతో పెనవేసుకొన్న జ్ఞాపకాలు, వాటితో అందిన ఆనందాలు మరే జనరేషన్‌కూ దక్కలేదేమో..?
గ్రౌండ్లో అడుగుపెడితే… స్టంపర్ బాల్, బేబీ ఓవర్.
స్కూల్ కెళితే… రైనాల్డ్స్ పెన్, గ్రీటింగ్ కార్డ్స్.
ఆదివారం వస్తే అమృతం సీరియల్…!
ప్రతీ అడుగులోనూ ఓ అందమైన అనుభవం, అనుభూతి దాగున్నాయి. వైర్లున్న ల్యాండ్ ఫోన్ పోయింది. సెల్ ఫోన్ చేతికందాక కనపడని వైర్లలో కాళ్లని కట్టిపడేసుకొన్నాం. అందుకే ఒక్కసారి పాత రోజుల్ని గుర్తు చేసుకొంటే ‘అప్పుడే బాగుండేది కదా’ అనిపిస్తుంటుంది. అలాంటి జ్ఞాపకాల్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా గుర్తు చేసినా మనసు కేరింతలు కొడుతుంది. అలా… ఒక్కసారి మనల్ని 90ల్లోకి లాక్కెళ్లిన ఓ వెబ్ సిరీస్ వచ్చింది. అదే… #90’s.
ఆరు ఎపిసోడ్ల సిరీస్ ఇది. కథ మొదలెట్టేటప్పుడే ‘పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే మధ్యతరగతి కథల్లో మలుపులుండవు… కేవలం అనుభూతులే’ అని చెప్పేశాడు దర్శకుడు. నిజమే. మన జీవితాల్లో రాసుకొని, వెబ్ సిరీస్‌గా తీసుకోదగిన కథలేముంటాయి? ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే ఇద్దరు బాగా చదివి, మరొకడు మొద్దులా తయారయ్యాడనుకోండి. తండ్రికి వాడి గురించే బెంగ. ఇంతకంటే ఓ తండ్రికి చెప్పుకోదగిన కథేముంటుంది? కష్టపడి చేసిన ఉప్మా ఎవరూ తినకుండా అలిగి వెళ్లిపోతే… ఆ అమ్మ ఒంటింట్లోనే ఒంటరిగా, దిగాలుగా చూస్తూ ఉండిపోతుంది. ఇదే మధ్యతరగతి తల్లి సంఘర్షణ. చుట్టంగా వచ్చిన మావయ్య వెళ్తూ.. వెళ్తూ వంద రూపాయలు ఇస్తాడా, ఇవ్వడా – అంటూ ఎదురు చూసిన పిల్లల అమాయకత్వంలోంచి పుట్టిన అందానికి మించిన సినిమా ‘గ్లామర్’ ఏముంటుంది? అవన్నీ కథలైపోయి, ఎపిసోడ్లుగా మారి ఇందులో మెరిశాయి.
హండ్రెడ్ రూపీస్, సిగ్నేచర్, రాట్ రేస్, ఉప్మా, ఫెయిర్ అండ్ క్రీమ్, స్లామ్ బుక్… ఇవీ ఎపిసోడ్లకు పెట్టుకొన్న పేర్లు. బెట్ మ్యాచ్‌లో వంద రూపాయలు పోగొట్టుకొని, వాటిని ఎలా సంపాదించాలో తెలియక తికమకపడుతున్న రఘుకి ఆ వందా ఎలా దక్కాయన్నది ‘హండ్రడ్ రూపీస్`లో చూడొచ్చు. మధ్యలో కేబుల్ టీవీ కోసం పాట్లు, అమృతం సీరియస్, మటన్ బొక్కల సరదాలూ.. ఇవన్నీ గుమ్మరించేశాడు. ‘పండిత పుత్ర పరమ సుంఠ..’ అనే నానుడి నిజం చేస్తూ లెక్కల మాస్టారు చంద్ర శేఖర్ (శివాజీ) అబ్బాయి ఆదిత్య చేసిన అల్లరి ‘సిగ్నేచర్’లో చూడొచ్చు. ”స్కూలు కిటికీ నుంచి గ్రౌండ్ లోకి ఎంత సేపయినా చూస్తా, కానీ బ్లాక్ బోర్డ్ ని ఒక్క నిమిషం కూడా చూడలేకపోతున్నా” అంటూ కళ్లల్లో నీళ్లు తిప్పుకొంటూ ఆదిత్య చెబుతుంటే.. మన గుండెల్లో సుడులు తిరుగుతాయి. అబ్బాయికి భరతనాట్యం, అమ్మాయికి కరాటే నేర్పాలని ఓ తండ్రి అనుకొన్న చోటే.. ‘ఫెయిర్ అండ్ క్రీమ్’ ఎపిసోడ్ పండేసింది. అవును… అమ్మాయిలకు ధైర్యం, తెగింపు అందివ్వాలంటే ఆ మాత్రం కొత్తగా ఆలోచించాల్సిందే కదా? నాలెడ్జ్ అంటే టెస్ట్ బుక్, సక్సెస్ అంటే ఫస్ట్ ర్యాంక్ అనే భ్రమల్లో ఉండే మనస్తత్వాలకు ‘రాట్ రేస్’ అద్దం పడుతుంది. ‘స్కూల్లో తెలుగు మాస్టారు, ఫ్లాపుల్లో ఉన్న హీరో, ఇంట్లో అమ్మ చేసే ఉప్మా ఇవ్వంటే మనకు చిన్నచూపే’ అంటూ ‘ఉప్మా’ గురించి ఓ ఎపిసోడ్ నడిపాడు దర్శకుడు. ఆ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు. చివర్లో… ‘కూరలో వేసే ఉప్పూ, కారం కంటికి కనిపించవు.. కానీ అవి లేకపోతే రుచే ఉండవు. ఇంట్లో ఉండే పెళ్లాం, అమ్మా కూడా అంతే’ అనే డైలాగ్ మరో ఎత్తు. ఓ సగటు ఇల్లాలు.. ఆ ఇంటి గురించీ, పిల్లల గురించీ ఎంతగా ఆలోచిస్తుందో చెప్పే ఎపిసోడ్ అది. ఓ నిజమైన టీచర్ ఎప్పుడు సంతోషంగా ఉంటాడో తెలుసా? తను పాఠాలు చెప్పిన విద్యార్థి ప్రయోజకుడు అయినప్పుడు. ఆ సమయంలో తన కొడుక్కి మార్కులు తక్కువ వచ్చాయే.. అనే బాధ ఉండదు. ‘స్లామ్ బుక్’లో ఈ చివరి సీన్… హృదయానికి హత్తుకొంటుంది. ఇలాంటి మాస్టార్లు ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇలా అన్నీ చిన్న చిన్న విషయాలే. మనకు తెలిసిన సంగతులే. కానీ ఆలోచిస్తే వాటి లోతెక్కువ. మనం ఎప్పుడో ఎక్కడో ఆ లోతుల్లో మునిగి తేలినవాళ్లమే.
మధ్య తరగతి తండ్రి పాత్రలో శివాజీ ఒదిగిపోయాడు. వయసుకి తగిన పాత్ర. శివాజీ వల్ల ఆ పాత్రకు హుందాదనం వచ్చింది. వాసుకి చాలాకాలం తరవాత కనిపించింది. ఓ ఇల్లాలిగా, తల్లిగా ఆమె పాత్ర చాలా పొందిగ్గా ఉంది. కొన్ని ఎపిసోడ్లలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు కానీ, తనదైన అవకాశం వచ్చిన చోట చక్కటి ప్రతిభ చూపించింది. ఇక పిల్లలు… రెచ్చిపోయారు. ముగ్గురూ ముగ్గురే. వాళ్ల నటన కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఆదిత్యలో ఓ చిచ్చరపిడుగు కనిపించాడు. తన టైమింగ్ నవ్వులు పంచుతుంది. నిజానికి ఇది అమ్మానాన్నల కథ కాదు. ముగ్గురు పిల్లల కథ. వాళ్ల సరదాలు, జ్ఞాపకాలే తెరపై కనిపిస్తాయి. అతిథి పాత్రలో వేణు ఉడుగుల మెరిశారు.
సంగీతం హాయిగా ఉంది. మాటలు అర్థవంతంగా సాగాయి. 90 నాటి కథ ఇది. ఆర్ట్ వర్క్ ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించాలి. ఈ విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. ఇంటి గోడ మీద ‘పోకిరి’ స్టిల్, బయట… ‘తారే జమీన్పర్’ పోస్టర్ చూపించారు. ఇవి 90ల్లో వచ్చిన సినిమాలు కానే కావు. ఈ విషయంలో శ్రద్ధ తీసుకొంటే బాగుండేది. ఇల్లూ, స్కూలూ.. ఇలా కనిపించిన లొకేషన్లు చాలా తక్కువ. అయినా బోర్ కొట్టదు. ఎందుకంటే మధ్యతరగతి కథలు, మనదైన జీవితాలు, మనం చూసొచ్చిన దారులు ఎన్నిసార్లు కళ్లముందు మెదిలినా హాయిగానే ఉంటుంది. ఈ వెబ్ సీరీస్ కూడా అంతే!
– అన్వర్