కేశినేని నానికి చంద్రబాబు ఇక తగ్గిపోండి అని నేరుగా సమాచారం పంపడం టీడీపీలో కలకలం రేపింది. ఓ రకంగా ఇది చంద్రబాబు స్టైల్‌కు వ్యతిరేకం. ఈ విషయాన్ని నాని కూడా చెప్పుకున్నారు. నామనేషన్ల చివరి రోజు వరకూ తేల్చరని కానీ తన విషయంలో మాత్రం ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. నాని ఈ మాటలు అనే ముందు.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను ఆయనే సృష్టించారనే సంగతిని గుర్తు చేసుకోవాలన్న సూచనలు వస్తున్నాయి.
పార్టీ అధినేత నిర్ణయాలను కేశినేని నాని ఎప్పుడూ శిరసావహించలేదు. టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే కనీస స్పందన వ్యక్తం చేయలేదు. యువగళం పాదయాత్రలో పాల్గొనలేదు. దూరంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ కంటే తానే గొప్ప అని.. తానే గెలిపించుకుంటానని చాలెంజ్ చేసి.. పార్టీకి నష్టం చేశారు. ఇక అధినేత ను ఎన్ని సార్లు అవమానించారో చెప్పాల్సిన పని లేదు. ఇంత చేసినా కేశినేని నానిపై చంద్రబాబు ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఆయన కుమార్తె పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్లారు కూడా.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదుగురితో కేశినేని నాని సున్నం పెట్టుకున్నారు. వారంతా వ్యతిరేకించారు. నానికి టిక్కెట్ ఇస్తే విధిలేక ఇచ్చారున్నట్లుగా మాట్లాడేవారు. ఇప్పటికే తాను ఇండిపెండెంట్ గా గెలుస్తానని చెబుతూ వస్తున్నారు. చివరికి ఆయన కుటుంబం నుంచే.. ప్రత్యామ్నాయం వచ్చింది. అది కూడా ఆయనకు నచ్చలేదు. చివరికి నానితో పెట్టుకోవడం కన్నా ఆయన సోదరుడు శివనాథ్ కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు.
అయితే కేశినేని తన పరిస్థితిని మెరుగుపర్చుకోవాల్సింది పోయి రోజు రోజుకు మరింత గా రచ్చ చేసుకున్నారు. ఎంతగా అంటే.. తిరువూరు సభ బాధ్యతలను చిన్నీకి ఇస్తే ఆయన అనుచరులతో వెళ్లి రచ్చ చేశారు. ఇంకా ఉపేక్షిస్తే గొడవలు అవుతాయని పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని నేరుగా చెప్పించారు. దీంతో కేశినేని పరిస్థితి మొదటికి వచ్చింది. అంతా స్వయంకృతంగానే చేసుకున్నారు.