ఈ సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ‘గుంటూరు కారం’పైనే అందరి దృష్టీ ఉంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ ల క్రేజీ కాంబో ఇది. ఈ పండక్కి.. బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టే సత్తా కూడా ఈ సినిమాకే ఉందని అభిమానుల గట్టి నమ్మకం. ఈ సినిమా నుంచి పాటలైతే వదులుతున్నారు కానీ, ప్రమోషన్ ఈవెంట్స్ ఏం జరగడం లేదు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అనుమానంలో పడింది. రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే… పోలీసులు ఆఖరి నిమిషంలో పర్మిషన్లు వెనక్కి తీసుకోవడంతో ఈవెంట్ వాయిదా పడింది. త్వరలోనే కొత్త వేదిక చెబుతామని, డేట్ ఫైనల్ చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ ప్లాన్ చేశారు. అక్కడ ఏర్పాట్లు కూడా మొదలెట్టారు. కానీ… అక్కడ పార్కింగ్ సమస్యలు ఉన్నాయి. పార్కింగ్ కోసం సమీపంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లు చేసుకొంటే, ఈవెంట్ కి అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పారు. కానీ.. ఆ అనుమతులు రాలేదు. దాంతో.. ఈవెంట్ ఆగిపోయింది. ఈసారి ఈవెంట్ ఎక్కడ చేస్తారు? అసలు ఈవెంట్ ఉంటుందా? లేదంటే నేరుగా ట్రైలర్ వదిలేస్తారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈనెల 12న సినిమా వచ్చేస్తోంది. మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు కొత్త వేదిక వెదికి, అక్కడ ఏర్పాట్లు షురూ చేయాలంటే కొంచెం కష్టమైన పనే.