సినిమా మేకింగ్ అనేది చాలా కష్టమైపోయిందిప్పుడు. ఒక్కో సినిమాకీ యేడాదైనా సమయం తీసుకొంటున్నారు. క్లైమాక్స్ ఫైట్ సీన్‌కే నెల రోజుల సమయం తీసుకొన్న సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఒక్క సినిమాని 3 నెలల్లో పూర్తి చేయడం విశేషమే. నాగార్జున ‘నా సామిరంగ’ ఈ ఘనత సాధించింది. అక్టోబరులో ఈ సినిమా మొదలైంది. ఈ సంక్రాంతికి వచ్చేస్తోంది. ఈమధ్య కాలంలో ఇంత తొందరగా పూర్తయిన సినిమా ఇదే. సినిమా ఫలితం ఎలా ఉండబోతున్నా, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం పట్ల నాగార్జున ఫుల్ ఖుషీగా ఉన్నాడు.
”ఈరోజుల్లో 3 నెలల్లో సినిమా పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. మేమంతా అంత కష్టపడ్డాం. కీరవాణి గారు సినిమా మొదలవ్వకముందే 3 పాటలు ఇచ్చారు. ఫస్ట్ ఫైట్ షూటింగ్ చేయకుండానే ఆర్.ఆర్ ఫినిష్ చేసి ఇచ్చారు. ఇంత మంచి టెక్నీషియన్లు ఉండబట్టే ఈ సినిమాని ఇంత త్వరగా పూర్తి చేశాం. ఈ సినిమా గురించి మేం గొప్పలు చెప్పుకోం.. సినిమా సక్సెస్ మీట్ తర్వాత మాట్లాడతాం. 3 నెలల్లో సినిమా తీయడం ఎలా అనే పుస్తకం రాసిస్తాం..” అని చెప్పారు నాగార్జున. ఈ పండక్కి వస్తున్న మిగిలిన 3 సినిమాలూ హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటేనే సినిమాల పండగ అని, తనకు సంక్రాంతి బాగా కలిసొచ్చిందని, ఈ సంక్రాంతి కూడా హిట్ కొడుతున్నాం అని అభిమానులకు భరోసా ఇచ్చారు. ఈ సినిమాపై ముందు నుంచీ నాగ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే.. థియేట్రికల్ రైట్స్ మొత్తం ఆయనే తీసుకొన్నారు. డిజిటల్ హక్కులూ మంచి రేటుకి అమ్ముడుపోయాయి. అలా రిలీజ్‌కి ముందే ఈ సినిమా లాభాల్ని చూడగలిగింది.