కేశినేని నానిని టీడీపీ వదిలించుకుంది. ఆయన వల్ల పార్టీ మొత్తం డిస్ట్రర్బ్ అవుతుందని లేటు చేయలేదు. కానీ వైసీపీ పిలిచి మరీ నెత్తికి ఎక్కించుకుంది. ఆయనకు రెండు, మూడు టిక్కెట్లు ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనతో ఎంత మంది టీడీపీ నేతలు వెళ్తారన్నది స్పష్టత లేదు. ఇప్పటి వరకూ ఆయన టీడీపీలో ఉన్నాడు కదా అని … ఆయనకు ఇష్టం లేని నేతలపై విమర్శలు చేస్తూ.. కేశినేని అనుచరులుగా కొనసాగిన వాళ్లు ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. తాము టీడీపీలో ఉంటామని.. వైసీపీలోకి వచ్చేది లేదని చెబుతున్నారు.
కేశినేని నాని సులువుగా జగన్ రెడ్డి దగ్గర చేరిపోవచ్చు కానీ స్థానిక నేతలు చేరిపోలేరు. ఇప్పటికే వైసీపీ నేతలు పెట్టిన టార్చర్ దిగువ నేతలకు ఇంకా గుర్తుంటుంది. అంతేనా… ఇప్పుడు కేశినేనితో పాటు వెళ్లి వారి కాళ్ల దగ్గర పడి ఉండాలా అన్న ప్రశ్న వస్తుంది. దాని కన్నా సొంత పార్టీ నయమని అనుకుంటారు. అదే జరుగుతోంది. ఆయన సొంత అనుచరులకు ఫోన్లు చేసినా పట్టించుకోవడం మానేశారు. తమపై పార్టీకి ఎక్కడ అనుమానం వస్తుందోనని నేరుగా వెళ్లి టీడీపీ ముఖ్యుల్ని కలిసి నమ్మకం పెంచుకుంటున్నారు కేశినేని వైసీపీ తరపున టిక్కెట్ ఇప్పిస్తారని ప్రచారం జరుగుతున్న ఎంఎస్ బేగ్ కూడా నమ్మకం లేక తన కుమారుడ్ని లోకేష్ వద్దకు పంపారు.
కేశినేని నాని ముందు తనతో పాటు కృష్ణా జిల్లా నుంచి అరవై శాతం మంది వస్తారని గొప్పలు పోయారు. ఇప్పుడు తన బలాన్ని ఆయన నిరూపించుకోవాల్సి ఉంది. ఎవరూ తనతో రాకుండా .. తాను.. తన కుమార్తె మాత్రమే పార్టీలో చేరుతామంటే… జగన్ రెడ్డి అసంతృప్తి కి గురవుతారు. ఇంతోటి దానికి… బాహుబలి రేంజ్ ఎలివేషన్లు ఎందుకని ఆయన .. పక్కన పెట్టేస్తారు. ఆ రోజులు రావడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చని టీడీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.