True Lover Movie review
ప్రతి బంధంలోనూ ‘సొంతం’ అనుకునే ఫీలింగ్ వుంటుంది. ఇద్దరు ప్రేమమికుల మధ్య అది ఇంకాస్త ఎక్కువ మోతాదులో వుంటుంది. అయితే అది కొన్ని సార్లు శ్రుతిమించిపోయిన అభద్రతభావానికి, అనుమానానికి, ఓవర్ పొసెసివ్ కి దారితీసి ప్రేమనే సమస్యల్లో పడేస్తుంది. తమిళం నుంచి డబ్బింగ్ సినిమాగా వచ్చిన ‘ట్రూ లవర్’ పాయింట్ కూడా ఇదే. మరా పాయింట్ వినోదాన్ని పంచేలా వుందా? ఈ ఓవర్ పొసెసివ్ ప్రేమికుడు మన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడా ?
అరుణ్ (మణికందన్), దివ్య(గౌరీ ప్రియ) కాలేజీ రోజుల నుంచి లవర్స్. చదువుపూర్తయ్యక దివ్య సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరుతుంది. అరుణ్ మాత్రం కేఫ్ పెట్టాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు. అరుణ్ ఓవర్ పొసెసివ్. దివ్య తనకి మాత్రమే సొంతం అనుకునే వైఖరిలో వుంటాడు. ఆమె ఎవరితో మాట్లాడినా తట్టుకోలేడు. అందరిముందు గొడవపడతాడు. అరుణ్ వైఖరితో దివ్యకి చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితి వస్తుంది. చాలా సార్లు బ్రేక్ అప్ చెబుతుంది. అనవసరంగా కోప్పడటం, మళ్ళీ సారీ చెప్పి కలవడం అరుణ్ కి ఒక అలవాటుగా మారిపోతుంది. అయితే ఒక దశలో అరుణ్ నుంచి పూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకుంటుంది దివ్య. తర్వాత ఏం జరిగింది? అసలు దివ్యని అంతలా బాధించిన విషయం ఏమిటి? మళ్ళీ ఈ జంట కలిసిందా? లేదా? అనేది తక్కిన కథ.
ఓవర్ పొసెసివ్ తో అభద్రతాభావం, అనుమానం పెరిగిపోయి అందంగా ఉండాల్సిన ‘ప్రేమ’ బంధంలో అగాధం సృష్టించుకున్న ఓ యువకుడి కథ ఇది. ట్రైలర్ లో ఈ సినిమా పాయింట్ ఏమిటనేది తెలిసిపోయింది. అది ఆసక్తి పెంచింది కూడా. ట్రైలర్ లో వున్న ఆసక్తి మాత్రం సినిమాలో కొనసాగలేదు. ఒకే పాయింట్ మీద సాగే చాలా చిన్న కథ ఇది. ఇలా సింగిల్ లైన్ పాయింట్ ని డ్రైవ్ చేయాలంటే ఆసక్తికరమైన డ్రామాని జోడించే నేర్పు వుండాలి. ట్రూ లవర్ లో అది కొరవడింది. పాత్రలని, కథని నడిపిన తీరు చాలా ఫ్లాట్ గా వుంటుంది. కథ టేకాఫ్ న్యూ ఏజ్ కంటెంట్ లా అనిపించినప్పటికీ కథ నడిపిన తీరులో మాత్రం నవ్యత లేదు. హీరోకి ఓవర్ పొసెసివ్ అన్న పాయింట్ దగ్గరే కథ ఆగిపోతుంది. అనుమానం అభద్రత వ్యక్తం చేయడం తర్వాత సారీ చెప్పి కలిసిపోవడం. ఇది మొదటి రెండు సీన్ల వరకూ బావుంటుంది కానీ.. ఎంతసేపు దాన్నే తిప్పితిప్పి చూపించే వైనం ఒక దశలో విసుగు తెప్పించేస్తుంది.
ఫస్ట్ హాఫ్ కొంతలో కొంత బెటర్ కానీ సెకండ్ హాఫ్ ని మాత్రం బీచ్, రిసార్ట్, ట్రెక్కింగ్ అంటూ పూర్తిగా ట్రావెలింగ్ వీడియోలా చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమకుల మధ్య సరైన సంఘర్షణ వుండదు. హీరో ప్రతి సీన్ లో బాధపడుతుంటాడు గానీ ఆ బాధ ప్రేక్షకులకు పట్టదు. పైగా సెకండ్ హాఫ్ లో ఏ మాత్రం డ్రామా లేదు. ఒక షార్ట్ ఫిల్మ్ వీడియోలా చిత్రీకరించేశారు. ఇందులో అరుణ్ అమ్మ నాన్నల కథని ఒక లేయర్ గా పెట్టారు. దాన్ని అరుణ్ దివ్యల ప్రేమకి కనెక్ట్ చేసిన వైనం సరిగ్గా కుదరలేదు. అందులో పెద్ద ఎమోషన్ వుందని చూపించారు కానీ నిజానికి ఆ ట్రాక్ సరిగ్గా రిజిస్టర్ కూడా కాదు. ఒక దశలో సైకో కథలా మారిపోతున్న అరుణ్ ప్రేమకు.. చివరికి ఇచ్చుకున్న ముగింపు మాత్రం నిజంగా అలాంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ప్రేమలో కొట్టుమిట్టాడుతున్న యవత పాటిస్తే మంచిదే.
అరుణ్ పాత్రలో మణికందన్ ఒదిగిపోయాడు. కథ బలహీనంగా వునప్పటికీ చివరి వరకూ తన ప్రజెన్స్ తో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. గౌరీ ప్రియ దివ్య పాత్రకు సరిపోయింది. చివర్లో అరుణ్ తల్లితో ఫోన్ లో మాట్లాడిన సన్నివేశంలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. అయితే ఆమె పాత్రలోని మానసిక సంఘర్షణని దర్శకుడు ఇంకా బలంగా చూపించాల్సింది. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కనిపించిన వారంతా తెలుగు తెరకు కొత్తే. నటన పరంగా ఓకే అనిపిస్తారు. మిగతా పాత్రలు పరిధిమేరకు వున్నాయి.
మ్యూజిక్ బావుంది. నేపధ్య సంగీతాన్ని ఎఫెక్టివ్ గా వాడుకున్నారు. కెమెరా పనితీరు కూడా డీసెంట్ గా వుంది. కథకు తగిన ప్రొడక్షన్ డిజైన్ వుంది. డైలాగుల్లో చాలా బీప్ సౌండ్లు పడ్డాయి. ఇలాంటి సింగిల్ లైన్ కథని ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. నిజానికి ఈ కథని ‘లవ్ టు డే’లా వినోదాత్మకంగా కూడా ట్రీట్ చేసుండొచ్చు. కానీ ఒకటే సీరియస్ టోన్ లో సుదీర్గంగా తీసుకుంటూ వెళ్ళడంతో చాలా చోట్ల సహనానికి పరీక్షపెడతాడు ఈ ప్రేమికుడు.
ఫినిషింగ్ టచ్: ఈ ప్రేమికుడ్ని భరించడం కష్టమే!
రేటింగ్: 2.25