బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. విపక్ష నాయకుని హోదాలో తొలిసారిగా శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ బడ్జెట్ ప్రసంగానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ, శాసన మండలి వాయాదా పడ్డాయి. సోమవారం కీలకమైన నీటి ప్రాజెక్టుల అంశంపై చర్చ జరగనుంది. ఆ రోజున కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది స్పష్టత లేదు.
పదమూడో తేదీన నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ ఏర్పాటు చేసింది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని బీఆర్ఎస్ రాష్ట్రంపై పోరాటం ప్రారంభించింది. రేవంత్ రెడ్డి తాము ఎలాంటి ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించలేదని..బీఆర్ఎస్ హయాంలోనే కొన్ని ప్రాజెక్టులు ఇచ్చారని చెబుతోంది. బీఆర్ఎస్ రాజకీయ. పోరాటానికి కౌంటర్ గా.. మేడిగడ్డ వద్దకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లి .. ప్రాజెక్టులో అవినీతి, బ్యారేజీ కుంగిపోవడం వంటి అంశాలను వివరించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడంతో సీఎం రేవంత్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి బీఏసీ సమావేశానికీ వెళ్లలేదు. తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవడం అసెంబ్లీని అవమానించడమేనన్న విమర్శలను కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని ప్రచారం చేశారు. తీరా ఆయన రాలేదు.