తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్, బండి సంజయ్ వర్గాల మధ్య పోరాటం తీవ్రమయింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తన పదవి పోవడానికి ప్రధాన కారణం ఈటల రాజేందర్ అని బండి సంజయ్ గట్టిగా నమ్ముతున్నారు. రెండు చోట్ల పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈటల రాజేందర్ ఇప్పుడు మల్కాజిగిరిపై దృష్టి పెట్టారు. దీంతో బండి సంజయ్ ఆయనకు లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ దక్కకుండా చేసేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇతర అభ్యర్థుల్ని ప్రోత్సహిస్తున్నారు.
బండి సంజయ్ .. తనకు వ్యతిరేకంగా మల్కాజిగిరిలో కీలక నేతల్ని పోటీకి ప్రోత్సహిస్తున్నారని వారి గురించి హైకమాండ్‌కు పాజిటివ్ నివేదికలిస్తున్నారని తెలియడంతో ఈటల రాజేందర్ తన వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించారు. బీజేపీ హైకమాండ్ తనకే టిక్కెట్ ప్రకటించిందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ నేతల్ని పిలిచి ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరుపుతున్నారు. దీంతో బీజేపీలో గందరగోళం ఏర్పడుతోంది. మల్కాజిగిరి ఎప్పుడూ లేనంత మంది ఈ సారి టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరేందర్ గౌడ్, హరీష్ రెడ్డి , కూన శ్రీశైలం గౌడ్ పోటీ పడుతున్నారు. వీరిలో కూన శ్రీశైలం గౌడ్ రాజీనామాకు కూడా సిద్ధపడ్డారు.
ఈటల రాజేందర్ తనకు మల్కాజిగిరి టిక్కెట్ ఇవ్వకపోతే.. పార్టీ మారిపోవడం ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నారు. ఆయనను బయటకు పంపించేయడానికి తాము సిద్ధమన్నట్లుగా బండి సంజయ్ వర్గం ప్రయత్నిస్తోంది. ఈటల రాజేందర్ ఈ విషయంలో ప్లాన్ బీతో ఉన్నారని.. ఆయన నేరుగా అమిత్ షాను సంప్రదిస్తున్నారని అంటున్నారు. అయితే ఈటల రాజేందర్ విషయంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాజిటివ్ అభిప్రాయంతో ఉన్నా.. ఫలితాలు తేవడంతో విఫలం కావడంతో ఆయనను మోదీ, షాలు నమ్మబోరని అంటున్నారు. బండి సంజయ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.