తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా మోగించిన ఎన్నికల ప్రచారభేరి సభ తాడేపల్లిగూడెంలో జరిగింది. భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటారు. ఒక్క స్టేజ్ మీదనే.. ఐదు వందల మంది ఇరు పార్టీల నేతలు ఉండేలా చూసుకున్నారు. అందరూ వచ్చారు కానీ.. నారా లోకేష్ మాత్రం కనిపించలేదు. అసలు సభకు నారా లోకేష్ రాలేదు.
నారా లోకేష్ ఉమ్మడి ప్రచారభేరి సభకు కావాలనే దూరంగా ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అది ఉమ్మడి ప్రచార భేరీ సభ. సభా ఏర్పాట్లను జనసేన పార్టీ తీసుకుంది. ఆ పార్టీ నేతలు సభ కోసం కష్టపడ్డారు. ఆ పార్టీ నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అనుకుంది. ఆ ప్రకారం.. చంద్రబాబు, బాలకృష్ణ లాంటి వారు మినహా టీడీపీ నేతలు ఎవరూ పెద్దగా ప్రసంగించలేదు.
మరో వైపు నారా లోకేష్ మంగళగిరిలో తీరిక లేకుండా కార్యక్రమాల్లో ఉన్నారు. రోజూ పలు రంగాల ప్రముఖుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. బుధవారం రోజున కూడా.. పెద్ద ఎత్తున చేరికలు.. వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. మళ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు నుంచి.. ప్రచార బాధ్యతల్ని రాష్ట్రం మొత్తం నిర్వర్తించాల్సి ఉంది. అందుకే నియోజకవర్గంలో సుడిగాలిలా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. మంగళగిరిలో రోజూ పదికిపైగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతల ఇళ్లకే కాదు తటస్థుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పలకరిస్తున్నారు.