వెబ్‌సిరీస్ ని సీజన్ల వారీగా కొనసాగించడం ఆషామాషీ వ్యవహారం కాదు. సీరియల్స్ లా ఎదో సాగదీసేస్తామంటే కుదరదు. వెబ్ సిరీస్ గ్రామర్ వేరు. ఈ గ్రామర్ పట్టుకున్న వెబ్ సిరీసులే సీజన్లకొద్ది నిలబడతాయి. గతడాది విడుదలైన సిరిస్ ‘సేవ్ ది టైగర్స్’. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలలో మహి వి. రాఘవ్ షో రన్నర్ గా వచ్చిన ఈ సిరిస్ చెప్పుకొదగ్గ స్థాయిలో నవ్వులు పంచింది. ఫ్యామిలీ డ్రామాలు కూడా వెబ్ సిరీస్‌లకు పనికొస్తాయని నిరూపించింది. ఇప్పుడు సీజన్ 2 ‘డిస్నీ+హాట్‌స్టార్’లో ప్రసారమైయింది. మరి, సీజన్ 2 ఎలా ఉంది? తొలి సీజన్ లో నవ్వులు కొనసాగాయా? సీజన్ల కొద్దినడిచే కంటెంట్ ఇందులో ఉందా?
సీజన్ 1 చూసిన వారికి కథ గుర్తుండేవుంటుంది. సీజన్ 2 కథ టూకీగా చెప్పుకుందాం . హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్)ను కిడ్నాప్ చేసే ఆరోపణలతో ఘంటా రవి (ప్రియదర్శి), రాహుల్ (అభినవ్ గోమఠం), విక్రమ్ (చైతన్య కృష్ణ)ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ ముగ్గురిని విచారిస్తుండగానే టీవీ జర్నలిస్ట్ విజయ్ కాంత్ (వేణు యల్దండి) ఆ ముగ్గురే హంసలేఖని చంపేశారని నానా హంగామా చేస్తాడు. రాత్రి తాగింది దిగిన తర్వాత హంసలేఖ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆ ముగ్గురు స్వాతిముత్యాలని చెప్పి విడిపిస్తుంది. తర్వాత ఏం జరిగింది? రవి, రాహుల్, విక్రమ్‌లతో హంసలేఖ ప్రయాణం ఎలా సాగింది? రవి కార్పొరేటర్ అయ్యాడా? రాహుల్ సినిమా రచన చేశాడా? విక్రమ్ లైఫ్‌లోకి వచ్చిన హారిక (దర్శన) సంగతేమిటి? అనేది తగ్గిన కథ.
ముందే చెప్పుకున్నట్లు వెబ్‌సిరీస్ సీజన్లగా కొనసాగించడం అంత తేలిక కాదు. తొలి సీజన్ హిట్ అయ్యింది కదా అని, కంటెంట్ లేకుండా మరో సీజన్‌కు శ్రీకారం చుట్టకూడదు. సేవ్ ద టైగర్స్ అనేది వెబ్ సిరీస్‌లలో ఓ బెంచ్ మార్క్‌గా నిలిచింది. వినోదం, ఫ్యామిలీ డ్రామా కలగలిపితే ఎలా ఉంటుందో సేవ్ ద టైగర్స్ నిరూపించింది. ఇలాంటి సిరీస్‌ని కొనసాగించాలంటే కంటెంట్ పరంగా దమ్ము ఉండాలి. `సేవ్ ద టైగర్స్ 2`లో అది కాస్త లోపించిందనిపిస్తుంది. ఇందులో ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి, చివరి ఎపిసోడ్ తప్పితే మిగతా ఎపిసోడ్లుని ఫిల్లర్స్ లా అనిపిస్తాయి. తొలి సీజన్ హిట్ కావడానికి కారణం అందులో వున్న సహజత్వం. ముగ్గురు జీవితాలలోని సంఘటనలని ఆహ్లాదకరంగా చిత్రీకరించి ఇవన్నీ మన ఫీలింగ్స్ అన్నట్టుగా చూపించి ఆ పాత్రలో ప్రయాణం చేసేలా చిత్రీకకరించారు. కానీ ఎప్పుడైతే ఈ ముగ్గురు కథలోకి ఓ హీరోయిన్ ని ప్రవేశపెట్టారో అప్పుడే వ్యవహారం అంతా అర్టిఫీషియల్ అయిపొయింది. కథ నేల విడిచి సాము చేసింది. ఈ హీరోయిన్ ట్రాక్ తో నడిచే సన్నివేశాలన్నీ చాలా సినిమాల్ని గుర్తు చేస్తూ సాగుతుంటాయి. ఇందులో కంటెంట్ లేదనే సంగతి సెకండ్ ఎపిసోడ్ లో వచ్చిన సైకాలజిస్ట్ ట్రాక్ చూస్తే అర్ధమౌతుంది. ఆ ట్రాక్ అస్సల్ వర్క్ అవుట్ కాలేదు. భర్తలపై అనుమానాలు పెంచేలా చిత్రీకరించిన ఆ వ్యవహారమంతా అనవసరం అనిపిస్తుంది.
అపార్ట్మెంట్ లో రాహుల్ పెట్స్ తో పడే ఇబ్బందులని ఒక ఎపిసోడ్ గా చూపించారు. ఆ గొడవ, పని మనిషి చేసే హంగామా జబర్దస్త్ స్కిట్లని గుర్తు చేస్తుంది. పెళ్లి కాన్సెప్ట్ ఎలా మొదలైందనే విషయాన్ని చూపించడానికి పూర్వంలోకి వెళ్లి ఎదో ఆల్ఫా మేల్ తరహాలో ఒక ఎపిసోడ్ పెట్టారు. అందులోనూ ఫన్ పండలేదు. పైగా ఆ ఎపిసోడ్ ని తీసిన విధానం, ఆ గెటప్పులు.. అదోలా వుంటాయి. ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అని ఒక ఎపిసోడ్ వుంది. సీరియల్ లో కంటెంట్ లేనప్పుడు ఎదో ఒక ఈవెంట్ పెట్టి నటులంతా స్టేజ్‌పై డ్యాన్సులు వేసుకుంటూ సంబరపడుతుంటారు. ఇది అలాంటి ఎపిసోడే. ఓ ఫంక్షన్ లో ఈ సీజన్ లో వుండే నటులంతా ఒక్క చోటకి చేరి ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ ఎపిసోడ్ చివర్లో రవి తన కూతురికి చెప్పిన మాటలు అర్ధవంతంగా ఉన్నప్పటికీ ఇప్పుదిడంతా ఎందుకనిపిస్తుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసరికి జోనర్ ఎమోషన్ కి షిఫ్ట్ అయిపోతుంది. అప్పటివరకూ నవ్వులు లేకుండా సమయం వృధా జరిగిందని గ్రహించినట్లు వున్నారు. చివరి ఎపిసోడ్ ని ఎమోషన్ ని పిండేయాలని చూశారు. సిరిస్ జోనర్ తో సంబంధం లేకుండా ముగ్గురికి మూడు ఎమోషనల్ టచ్చింగ్ లు ఇచ్చి దీనికి ఇంకా కొనసాగింపు వుందనే కోణంలో సీజన్ ముగించారు.
ప్రియదర్శి ట్రాక్ కొంతలో కొంత బెటర్. ఆ పాత్రలో ఆయన ఒదిగిన తీరు కూడా బావుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకునే హైమా ముచ్చట చుట్టూనడిపిన కొన్ని సీన్స్, పెద్దమనుషుల పంచాయితీ నవ్వులు పంచుతాయి. గత సీజన్ లో రాహుల్, పని మనిషి రోహిణి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వించాయి. ఈ సీజన్ లో కూడా వాళ్లే రిలీఫ్ ఇస్తారు. సీరత్ కపూర్ ట్రాక్ పై కాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. వేణు యెల్దండి, సత్య కృష్ణ జోడి, వాళ్లపై నడిపిన సన్నివేశాలు ఓకే అనిపిస్తాయంతే. చైతన్య కృష్ణ, దర్శనా బానిక్ మధ్య వచ్చే సన్నివేశాల్లో కొత్తదనం లేదు. రాహుల్, విక్రమ్ అత్తమామల పాత్రలు నవ్వుతెప్పించకపోగా చిరాకు కలిగిస్తాయి. నేపధ్య సంగీతం, కెమరాపనితనం డీసెంట్ గానే వున్నాయి. దర్శకుడు అరుణ్ కొత్తపల్లి రైటింగ్ టేబుల్ దగ్గర ఇంకాస్త వర్క్ చేయాల్సింది. సినిమా నటులంతా చేసిన వెబ్ సిరీస్ కాబట్టి, దీనికో కొత్త గ్రామర్ వచ్చింది. ఆ కోణంలో ఈ వెబ్ సిరీస్‌ని చూడొచ్చు. `సేవ్ ది టైగర్స్`లా ఆద్యంతం నవ్వులు పంచకపోయినా.. అక్కడక్కడ కాస్త కాలక్షేపం దొరుకుతుంది. అంతే!