ఎం.ఎల్.ఏ గానో, ఏంపీగానో ఎన్నికల్లో పోటీ చేసి, చట్ట సభల్లో అడుగు పెట్టాలన్న అలీ కల.. కలగానే మిగిపోనుంది. 2014 నుంచి ఆయన టికెట్ కోసం ఎదురు చూడడం, మొండి చేయి ఎదురవ్వడం.. రిపీట్ సీన్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. 2019కి ముందు అలీ టికెట్ కోసం అన్ని పార్టీల గడపలు ఎక్కి, చివరికి వైకాపా గూటికి చేరారు. ఆ సమయంలో అలీకి టికెట్ ఖాయం అనుకొన్నారంతా. కానీ జగన్ మొండి చేయి చూపించారు. కనీసం నామినేటెడ్ పదవైనా వస్తుందనుకొంటే.. గౌరవ సలహాదారుగా నియమించి చేతులు దులుపుకొంది వైకాపా ప్రభుత్వం. ఈసారి ఎన్నికల్లోనూ అదే సీన్. వైకాపా ప్రకటించిన చివరి లిస్టులోనూ అలీ పేరు లేదు. దాంతో అలీ ఆశలు గల్లంతయ్యాయి.
ఎన్నికల్లో పోటీ చేసి, చట్ట సభల్లోకి అడుగుపెట్టాలన్నది అలీ ధ్యేయం. చాలాసార్లు ఈ మాట చెప్పారాయన. అందుకోసం మిత్రుడైన పవన్ కల్యాణ్‌తోనూ వైరం తెచ్చుకొన్నారు. జనసేన పక్షాన ఉంటే ఈసారి ఆయనకు కచ్చితంగా టికెట్ దొరికేది. కానీ జగన్ ని నమ్ముకొని మునిగిపోయారు. ఈసారి జగన్ గెలుస్తాడన్న నమ్మకం ఎవరికీ లేదు. ఆ పార్టీలో ఉంటే.. అలీకి విలువ ఎప్పటికీ దక్కదు. ఇప్పటికిప్పుడు పార్టీ మారినా ప్రయోజనం లేదు. అలా అలీ రాజకీయ జీవితం పూర్తిగా ఎటు కాకుండా పోయింది.