టిడిపి-జనసేన-బిజెపి చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడు మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ ఇది. ముందుగానే ఈ సభను నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత బీజేపీతో పొత్తు ఖరారయింది. అప్పుడే ఈ సభకు మోదీని ఆహ్వానించారు. దక్షిణాదిలో మోదీ పర్యటించే సమయంలోనే సభ ఉండటంతో.. వెంటనే ఖరారయింది.
మోదీ కూడా వస్తున్నందున భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నాయి. సుమారు 10 లక్షల మంది వస్తారని ఆ పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ, టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. అలాగే పార్టీకి పది మంది చొప్పున సీనియర్ నాయకులు వేదికపై ఉంటారు. మోడీ కోసం మూడు హెలీప్యాడ్లు, చంద్రబాబు, పవన్ కోసం మరో మూడు హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. మోడీ హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ఆదివారం చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు సభా ప్రాంగాణానికి చేరుకుంటారు. చంద్రబాబు, పవన్ 4.30 గంటలకు సభ ప్రాంగణానికి ప్రత్యేక హెలీకాప్టర్లలో రానున్నారు.
ఆర్టీసీ అధికారులు అడిగి మరీ బస్సులు ఇచ్చారు. అలాగే విద్యా సంస్థల యజమానులు కూడా బస్సులను పంపిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు కూడా… వైసీపీ తరపున బెదిరించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. వైసీపీపై విరుచుకుపడితే.. అవినీతిని వదలబోమని.. హెచ్చరిస్తే… వైసీపీకి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది.