ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన పీటముడి ఎట్టకేలకు వీడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య భవన్ ఆస్తులను విభజిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 11.536 ఎకరాలు కేటాయించగా, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించింది. ఎపికి కేటాయించిన 11.536 ఎకరాల్లో 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన 8.245 ఎకరాల్లో శబరి బ్లాక్‌లో 3 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ విషయంలో ఏపీలో గొడవలు పడటం దండగ అని.. కేంద్రం చూపించిన పరిష్కారానికి అంగీకరించడం మేలని సీఎం పదవి చేపట్టగానే రేవంత్ డిసైడ్ అయ్యారు. గతంలో ఢిల్లీలో అశోక రోడ్ లోని ఏపీ-తెలంగాణ భవన్ తమకే కావాలని గత తెలంగాణ ప్రభుత్వం కోరింది. హైదరాబాద్ హౌస్ కి అనుకొని ఉన్న స్థలంతో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని గతంలో హోంశాఖ, ఏపీ అధికారులకు తెలంగాణ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఏపీ- తెలంగాణ భవన్, శబరి బ్లాక్, రోడ్డు, నర్సింగ్ హాస్టల్ సహా 12 ఎకరాల పైగా భూమి తమకు చెందాలని వాదించారు. అయితే ఇది వివాదం కొనసాగించడానికి చేస్తున్న వాదనగా ఉందన్న విమర్శలు వచ్చాయి.
ఏపీ భవన్ విభజన పూర్తవగానే అక్కడ తెలంగాణ భవన్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. పటౌడీ హౌస్‌లోని 5.245 ఎకరాల ఖాళీ జాగాలో కొత్త భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నది. శబరి బ్లాక్ చాలా పురాతనమైనది కావడంతో దాన్ని తొలగించి ఆ స్థలంలో కూడా భవనాన్ని నిర్మించాలా? లేక ఆ బ్లాక్‌ను యథాతథంగా ఉంచి పటౌడీ హౌస్‌లోని 5.245ఎకరాల ఖాళీ జాగాలో నిర్మిస్తే సరిపోతుందా? అన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగణ సంస్కృతిక వైభవం ఉట్టిపడేలా నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.