తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు ఇంకా దుర్వాసన వెదజల్లుతున్నాయని వాటిని పీకేస్తానని హెచ్చరించారు. తన వంద రోజుల పాలనపై రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఇక ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను పూర్తి రాజకీయ పార్టీ నాయకుడిగా పని చేస్తానని ప్రకటించారు.
కేసీఆర్ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. తులసి వనంలో కొన్ని కేసీఆర్ గంజాయి మొక్కలు ఇంకా వాసన వెదజల్లుతున్నాయి. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీసులు ఇచ్చింది. ముందు డబ్బులు కట్టాకే జీరో విద్యుత్ బిల్లు ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. వారు ముందు సబ్సిడీ చెల్లించాకే జీరో బిల్లు ఇవ్వాలని చెబుతున్నారు. ఆ మేధావికి నేను ఒకటే చెప్తా.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు ఈ ఆదేశం ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు కేసీఆర్ బంధువు. ఐదేళ్ల నుంచి అదే పదవిలో ఉన్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేవారు. ఇప్పుడు ప్రభుత్వానికి నోటీసులు ఇస్తున్నారు. అందుకే రేవంత్ ఫైర్ అయ్యారు. నీ ఇంటిపేరు తన్నీరు ఉన్నంత మాత్రాన నువ్వు పన్నీరు కాలేవు. ఈ తెలివి తేటలు మానాలి. అందుకే ఈ గంజాయి మొక్కలను పీకే పనిలో ఉన్నా. ఇప్పటికే కొన్ని గంజాయి మొక్కలను పీకేశా. రోజుకు 18 గంటలు పని చేసి గంజాయి మొక్కలు లేకుండా పీకేస్తా. అని హెచ్చరించారు. తన్నీరు గారూ.. గుర్తు పెట్టుకోండి.. నువ్వు కూడా ఆ కుర్చీలో ఎక్కువ సేపు ఉండవని హెచ్చరించారు.