Murder Mubarak review
మర్డర్ మిస్టరీల్లో క్లాసిక్స్ గా నిలిచిన దాదాపు సినిమాలు పుస్తకాల ఆధారంగా రూపొందిననే. అగాథ క్రిస్టి రచనలతో తెరకెక్కిన మర్డర్ ఆన్ ది ఒరియంట్ ఎక్స్ ప్రెస్, డెత్ ఆన్ ది నైల్, క్రుకుడ్ హౌస్ లాంటి చిత్రాలు ఈ జోనర్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఈ చిత్రాల స్ఫూర్తితో కొందరు రచయితలు ఇదే తరహ కథలు నవలలుగా అందించారు. అంజు చొహన్ రాసిన ‘క్లబ్ యూ టు డెత్’ పుస్తకం కూడా ఈ ఛాయల్లోనే వుంటుంది. ఇప్పుడు అదే పుస్తకం ఆధారంగా సారా అలీ ఖాన్, కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠి, డింపుల్ కపాడియా లాంటి బాలీవుడ్ స్టార్స్ తో రూపొందిన చిత్రం ‘మర్డర్ ముబారక్’. హోమి అదాజానియా దర్శకత్వంలో ఈ చిత్రం తాజాగా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ లోకి వచ్చింది. మరీ మర్డర్ మిస్టరీ థ్రిల్ పంచిందా?
అది బ్రిటిష్ కాలం నాటి ‘రాయల్ ఢిల్లీ క్లబ్’. సర్వ వసతులూ అక్కడ వుంటాయి. అందులో మెంబర్ షిప్ తీసుకోవాలంటే కోట్లలో వ్యవహారం. కొన్ని ఉన్నత కుటుంబాల్లోని వ్యక్తులు బ్రిటిష్ కాలం నుంచి ఆ క్లబ్ సభ్యతంతో విలాసవంతంగా అక్కడ కాలక్షేపం చేస్తుంటారు. ఒక రోజు ఆ క్లబ్ లో జుంబా ట్రైనర్ లియో మాథ్యుస్ (ఆషిమ్ గులాటి) విగత జీవిగా కనిపిస్తాడు.
ఏసీపీ భవాని శంకర్ (పంకజ్ త్రిపాఠి ) లియో ది మర్డర్ అని తేలుస్తాడు. షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్) బాంబీ (సారా అలీ ఖాన్) కుకీ ( డింపుల్ కపాడియా) రోషిణి (టిస్కా చోప్రా) రణ్ విజయ్ సింగ్ (సంజయ్ కపూర్) ఆకాశ్ ( విజయ్ వర్మ) ఇలా క్లబ్ మెంబర్స్ అందరినీ విచారిస్తాడు. మరి తన విచారణలో ఏం తేలింది? లియోని హత్య చేసింది ఎవరు? చివరికి హంతకుడు దొరికాడా లేదా? అనేది తక్కిన కథ.
పుస్తకానికి తెరరూపం ఇవ్వడం ఒక స్పెషల్ టాలెంట్. చదువుతున్నప్పుడు వచ్చిన అనుభూతి చూస్తున్నప్పుడు కూడా తెప్పించే నేర్పు కొందరికే వుంటుంది. మర్డర్ ముబారక్ దర్శకుడు ఓ క్రైమ్ ని పట్టుకున్నాడే కానీ దాన్ని థ్రిల్లింగ్ గా చెప్పలేకపోయాడు. రాయల్ ఢిల్లీ క్లబ్ లో ఓ రాత్రి జరిగిన తంబోలా నైట్ తో కథని, పాత్రలని ప్రవేశపెట్టాడు. తొలి సన్నివేశంలోనే ఓ హత్య జరిగినట్లు చూపించి రెండో సీన్ లో అసలు మర్డర్ ని తెరపై తీసుకొచ్చిన తీరు చూసినప్పుడు సినిమాలో ఇంకెన్ని సర్ ప్రైజ్ లో ఉంటాయో అనుకుంటాం. కానీ ఆ ఊహలు క్షణంలోనే ఆవిరైపోతాయి. మర్డర్ మిస్టరీ నుంచి అసంబద్దమైన జోనర్ వైపు కథ, పాత్రలు మలుపు తీసుకోవడంతో తాడు లేని బొంగరంలా సినిమా ఎటూ తిరగదు. భవాని శంకర్ చేసే విచారణలో సీరియస్ నెస్ వుండదు. అత్తారింటికి వచ్చిన అల్లుడిలా సిగ్గుపడుతూ విచారణ చేస్తుంటాడు. అదే అతని స్టయిల్ అనుకోవచ్చు కానీ ఆ స్టయిల్ ప్రేక్షకులు ఏ మాత్రం పట్టదు.
ఈ కథలో అవసరానికి మించిన పాత్రలు వుండటం మరో ఇబ్బందికరమైన అంశం. బహుశా అరిస్టులందరికీ పని కల్పించాలని అనుకున్నారేమో కానీ శృతి మించిన పాత్రలు వున్నాయి. ఆ పాత్రల వెనుక ఒకొక్క కథ వుంటుంది. ఆ కథ ఏమిటో, వాళ్ళ బాధ ఏమిటో ప్రేక్షకుడికి పట్టదు. ఒక దశలో ఈ పాత్రలన్నీ అసలు కథని పక్కదారి పట్టించేస్తాయి. విచారణ మొదలుపెట్టిన తర్వాత ఏ దశలోనూ ఈ మర్డర్ మిస్టరీ గుట్టు తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడదు. దానికి కారణం కూడా తలాతోక లేని పాత్రలే. రిచ్ క్లబ్ హౌస్, అక్కడ రిచ్ పాత్రలు, వాళ్ళ వ్యవహారంపై అంతర్లీనగా సెటైర్ వేయాలనుకున్నాడు దర్శకుడు. బాగా లోతుగా పరిశీలిస్తే కానీ ఆ సెటైర్ మామూలు ఆడియన్స్ కి పట్టదు. కథముందుకు వెళుతున్నకొద్ది ఎదురయ్యే రెండు ట్విస్ట్ లు బాగున్నప్పటికీ అసలు మిస్టరీని ఇవి అంతగా ఎలివేట్ చేయలేకపోయాయి. పైగా ఈ సినిమాలో కేసు విచారిస్తున్న పోలీస్ పాత్రని చాలా సినిమాటిక్ లిబర్టీ తో డిజైన్ చేశారు. ఏ ఎఫర్ట్ పెట్టకుండా తనకి అన్నీ క్లూలు దొరికిపోతుంటాయి. క్లైమాక్స్ కూడా చాలా పేలవంగా వుంటుంది. ఇలాంటి కథల్లో పోలీసులే అన్నీ రివీల్ చేయాలి. అప్పుడే కిక్. కానీ ఇందులో నేరం చేసిన వారే ఆ నేరాన్ని పూసగుచ్చినట్లు చెప్పడం అంతగా రుచించిదు.
ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది నటీనటులే. బాలీవుడ్ లో ఫేం వున్న తారలు కనిపించిన సినిమా ఇది. పంకజ్ ఇందులో ఓ వెరైటీ పోలీసు ఆఫీసర్. జనాలతో కలిసిపోవాలని యూనిఫాం లేకుండా డ్యూటీ చేస్తుంటాడు. అయితే ఆయన బాడీ లాంజ్వేజ్ ఈ కథకు అంతగా మ్యాచ్ కాలేదనే చెప్పాలి. చాలా చోట్ల లేజీగా కనిపిస్తారు. క్రైమ్ థ్రిల్లర్స్ లా వేగాన్ని ఆశిస్తే నిరాశతప్పదు. బాంబీ పాత్రలో కావాల్సినదానికంటే ఎక్కువ గ్లామర్ వెదజల్లింది సారా. శ్రుతిమించిన ఓ హాట్ సీన్ వుంది. కథకు అంత హాట్ నెస్ అవసరం లేకపోయినా దాన్ని ఎరోటిక్ గా చిత్రీకరించారు. విజయ్ వర్మ ఈ మధ్య కేవలం హీరోయిన్స్ తో రోమాన్స్ చేసే రన్దీప్ హుడా లా మారాడు. ఇందులో ఆయన చేసిన పాత్ర ఇలానే వుంది. కరిష్మా కపూర్ ప్రజెన్స్ ఓకే కనిపిస్తుంది. డింపుల్ కపాడియా పాత్రని అదోరకంగా చిత్రీకరించారు. టిస్కా చోప్రా, రణ్ విజయ్ సింగ్ తో పాటు మిగతా పాత్రలు పరిధిమేరకు వున్నాయి.
నిర్మాణ పరంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. నేపధ్య సంగీతం, కెమెరాపనితనం డీసెంట్ గా వున్నాయి. దర్శకుడు నటులపై పెట్టిన ద్రుష్టి కథపై కూడా పెట్టాల్సింది. మిగతా ఓటీటీ చార్జీలతో పోస్తే నెట్ ఫ్లిక్స్ చార్జీలు ఎక్కువగానే వుంటాయి. సభ్యత్వం వుంటే మరో ఆప్షన్ లేకపోతే ఈ సినిమాని ఓసారి ప్రయత్నించొచ్చు.