పల్నాడు సభ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎగ్జైట్ చేసింది. ఎంతగా అంటే.. ఆ ఒక్క సభ.. జన స్పందన గురించి ఏకంగా పన్నెండు ట్వీట్లు పెట్టారు. మోదీ ఖాతా నుంచి ఇలా ఓ ప్రోగ్రాంపై భారీగా ట్వీట్లు పెట్టడం అనేది అరుదు. అదీ కూడా మిత్రపక్షం టీడీపీ ప్రధాన బాధ్యత తీసుకుని నిర్వహించిన సభ విషయంలో ఆయన ఇంతగా ఎగ్జైట్ కావడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
ప్రధాని మోదీ తన రాజకీయ జీవితంలో అత్యంత భారీ బహిరంగసభల్లో ప్రసంగించి ఉంటారు. అలాంటి సభలకు వచ్చే జనం..వారి స్పందనలపై ఆయనకు అవగాహన ఉంటుంది. పల్నాడు సభ కూడా అలాంటి భారీ సభల్లో ఒకటిగా మోదీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు.. సభకు వచ్చిన వారి జోష్ ఆయనను మరింతగా ఎగ్దైట్ చేసింది. ప్రసంగాలు పూర్తయ్యే వరకూ ఒక్కరూ బయటకు పోకపోగా.. సౌండ్ టవర్లు ఎక్కి వినేందుకు ప్రయత్నించారు. కనీసం పది కిలోమీటర్ల పొడుగూతా జనం ఉండటం చూసి ప్రజల్లో ఉన్న ఆకాంక్షను కూడా ఆయన గుర్తించారు. అందుకే ప్రసంగంలో ప్రజలు ఇప్పటికే డిసైడైపోయారని అన్నారు.
పల్నాడు సభ సక్సెస్ పై మోదీ .. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతోనూ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా పావు గంట సేపు వీరి మధ్య భేటీ జరిగింది. అందులో వ్యక్తిగత కుశల ప్రశ్నలో పాటు .. కొన్ని కీలక అంశాలపైనా చర్చించినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఎన్నికలకోడ్ వచ్చిన తర్వాత తొలి బహిరంగసభ అద్భుుతంగా సక్సెస్ కావడం మోదీని కూడా ఆనందపరిచింది.