”మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది”. ఇవి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అన్న మాటలు. ఇప్పుడు అన్నంత పని చేశారు. బీఆర్ఎస్ నేతలు కారు దిగి హస్తం గూటికి వరుస కడుతున్నారు. ఒకవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో బీఆర్ఎస్ నేతలు బాధలో ఉన్నారు. మాజీ ఎంపీ జిత్తేందర్రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్‌లు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఈ చేరికలు ఊపందుకున్నాయి. ఇదే ఊపులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు వరదలా వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికలలోపు అందరూ చేరడం పూర్తి కాగానే, గ్రేటర్ నుంచి ఒకరిద్దరికి మంత్రి పదవులు కూడా ఇస్తారనే టాక్ నడుస్తోంది.
రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలువాలనే ఎన్నికల వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాలకే అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా వ్యూహాత్మకంగా ఆపింది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు వచ్చే అవకాశం ఉండటంతో వారి కోసమే టికెట్లను ఆపిందని ఆ వర్గాలు అంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు కలిసి కట్టుగా బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేస్తారనే టాక్ వైరల్ అవుతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారు అసంతృప్తికి గురి కాకుండా కాంగ్రెస్ ముందుస్తు చర్యలు చేపట్టింది.
అందులో భాగంగానే 37 కార్పొరేషన్లకు చైర్మెన్లను ప్రకటించి జాతరను తలపించింది. అసెంబ్లీ ఎన్నికల సమ యంలో టికెట్ దక్కని నాయకులకు, అనుబంధ సంఘాల నాయకులకు చైర్మెన్ పదవులిచ్చి అసంతృప్తిని చల్లారించింది. త్వరలోనే మరికొంత మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ 7 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. చెవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డిని ప్రకటించినప్పటికీ ఆయన కాంగ్రెస్‌లో చేరారంటే బీఆర్ఎస్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.