సినిమాల్లో గోదావరి పాటలు (పార్ట్ 2)
కన్నెపిల్ల వయ్యారంగా నడుం ఊపుతూ, అంతకంటే వయ్యారంగా వాలుజడను అటూఇటూ కదలిస్తూ, మోముపై చిరునవ్వులు చిందిస్తూ పంటకాలవ గట్టున నడిచివెళుతుంటే ఎంతటి ప్రవరాఖ్యుడికైనా అటువైపు చూపుపడకమానదు. అలాంటిది, అదే కన్నెపిల్ల దూకుడుపెంచి ఉరుకులు పరుగులు పెడుతూ గలగలా నవ్వుతూ, త్రుళ్లుతూ మాటలతో సరాగాలాడుతుంటే, ఆ ఊపు చూసిన గోదావరి తీర ప్రాంతాల్లోని జనమంతా ఒకటే మాట అంటారు. ఒకే రకంగా పోల్చుకుంటారు. అదే..
`గోదావరి పొంగొచ్చినా, కన్నెపిల్లకు ఈడొచ్చినా ఆగదు… ‘
ఎక్కడో పుట్టి, ఎన్నో కొండలూ గుట్టలు దాటుకుంటూ సముద్రుడిని కలవాలని గోదావరి ఎంతగా ఊవ్విళ్లూరుతుందో, మరెంత వడివడిగా ప్రవహిస్తుందో కవులు అనేక సందర్భాల్లో కమనీయంగా వర్ణించారు. సినీకవి ఆరుద్రగారు 60దశకంలో రాసిన ఒక అందమైన పాటను ఇప్పుడు గుర్తుచేసుకుందాం.
జగ్గయ్య, కృష్ణకుమారి నటించిన `ఉయ్యాల జంపాల’ చిత్రం 1965లో రిలీజ్ అయింది. ఈ చిత్రం కోసం ఆరుద్రగారు ఒక చక్కటి పాట రాశారు. అందులో కవి అంటారు `గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది.. ‘ అని.
మనసులో కోరిక పుడితే, అది ఎంత ఉధృత రూపందాలుస్తుందో పోల్చాలంటే కవికి గోదావరే తట్టింది. మామూలుగా అయితే గోదావరికి ప్రశాంతంగానే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే చాలా అమాయకపు కన్నెపిల్లలా ఉంటుంది. కానీ అదే పడుచు ప్రేమలో పడితే ప్రియుడు పలవరిస్తుంటే గుండె ఊసులాడుతుంది. పట్టరాని లేత వలపు పరవశించి పాడుతుంది.
ఈ సినిమాలో జగ్గయ్య (హీరో) గోదావరిమీద పడవనడుపుతూ పాట ఎత్తుకుంటాడు. పక్కన కాలవగట్లుమీద వయ్యారంగా నడుస్తూ కృష్ణకుమారి (హీరోయిన్) వంత పాడుతుంటుంది. ప్రేమలో పడ్డ వీరిద్దరిలో కవి వరదగోదావరినే చూపించడం కవి చమత్కారం. ఈ పాటకు చిత్రీకరణ కూడా కనులవిందే. కోనసీమ అందాలను ఆరబోసినట్టుగా తీశారు ఈ పాట చిత్రీకరణ. పెండ్యాల స్వరకల్పనలో ఘంటసాల, సుశీల ఆలపించిన ఈ పాట రచన ఎలా సాగిందో ఓసారి గమనించండి. .
ఉయ్యాల జంపాల చిత్రంలో పాట:
కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది.. పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ..
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది..
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది.. పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ..
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది..
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది..
కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది..
నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది..
పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది..
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది..
కొండగాలి తిరిగింది .. గుండె ఊసులాడింది.
చివరిగా ఈ పాట గురించి మరో విషయం చెప్పుకోవాలి. ఆరుద్రగారు ఈ పాటని `ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోతుందం’టూ ముగిస్తారు. చిత్రీకరణ సమయంలో యూనిట్ కి ఓ డౌట్ వచ్చింది. చివరి లైన్ నెగటీవ్ గా ఉన్నదన్నదే ఈ డౌట్. అప్పటికే పాట రికార్డింగ్ అయిపోయింది కనుక మళ్ళీ రికార్డింగ్ కు వెళ్లలేరు. అందుకే దర్శకుడు కె.బీ తిలక్ ఈ పాట కాగానే హీరో జగ్గయ్య ని వొడ్డుకు రప్పించి ప్రియురాలి (కృష్ణకుమారి)తో – `ప్రాప్తమున్న తీరానికి పడవ వచ్చి నిలిచింది’ అన్న డైలాగ్ చెప్పించారట. మరి ఆ పాట వింటూ గోదావరి తలచుకుంటూ మీరూ ఉప్పొంగిపోండి.
(గోదావరిపై మరో సినిమా పాట గురించి తర్వాత ముచ్చటించుకుందాం…).
– కణ్వస