దేశ రాజకీయానికి మోదీ పెనుభూతంలా మారారని.. ఆయనను ప్రకృతి శిక్షిస్తుందని శాపాలు పెట్టారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. ఈ వారం కొత్త పలుకు పేరుతో రాసిన ఆర్టికల్ లో మోదీ రాజకీయ పయనం గురించే ఎక్కువగా రాసి ఆవేశపడ్డారు. ప్రత్యర్థల్ని లేకుండా చేస్తున్న ఆయన తీరును ప్రకృతి సహించబోదని శిక్షిస్తుందని హెచ్చరించారు. కేజ్రీవాల్ అరెస్టుతోనే ఆయన ఆగిపోరని.. రాజసూయ యాగం.. స్టాలిన్ అరెస్ట్ వరకూ సాగుతుందన్న సంకేతాలు ఇచ్చారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కాషాయజెండా ఎగరవేయడమే మోదీ లక్ష్యమని అప్పటి వరకూ ఆయన తగ్గరని అంటున్నారు.
మోదీ ఎదుగుదలకు.. ప్రాంతీయ పార్టీల్నే ఆయన నిందించారు. ప్రాంతీయ పార్టీలు అత్యాశకు పోయి ఇతర రాష్ట్రాలకు విస్తరించడం.. కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడం ద్వారా .. మోదీకి ప్రాణం పోశారని.. ఇప్పుడు ఆ మోదీనే ప్రాంతీయ పార్టీల్ని మింగేస్తున్నారని విశ్లేషించారు. బీజేపీతో అంట కాగిన పార్టీలు.. బీజేపీతో తీవ్రంగా విబేధించిన పార్టీలూ కనుమరుగు అవుతున్నాయంటున్నారు. మిగిలిన వారు సామంతులుగా ఉంటే.. మాత్రం క్షమిస్తున్నారని ఆర్కే తేల్చేశారు. ఆర్కే చెప్పిన మాటల్లో ఇసుమంత కూడా అవాస్తవం లేకపోయినప్పటికీ.. మోదీ రాజకీయ పయనం పూర్తిగా ప్రజల సపోర్ట్ తోనే సాగుతోంది. ప్రజల్ని భావోద్వేగాలకు గురి చేస్తున్నారా.. నిజంగా మేలుచేస్తున్నారా అన్నది ఎవరూ చెప్పలేరు కానీ ప్రజలు ఓట్లు వేయకపోతే ఆయన అంత బలంగా ఉండలేరు. అదే ప్రజాస్వామ్యం. అయితే ఇక్కడ మోదీ.. ప్రజల కన్నా.. దర్యాప్తు సంస్థలు.. ఇతర రాజకీయాల ద్వారా ఎదిగిపోతున్నారన్నట్లుగా రాసుకొచ్చారు
ఇందిరా గాంధీ ఇంత కంటే ఎక్కువ అధికారాన్ని చెలాయించారని తర్వాత ఏమయిందన్నట్లుగా ఆర్కే చెప్పుకొచ్చారు. కొత్తపలుకులో ప్రస్తావించిన అన్ని అంశాల్లోనూ మోదీని విమర్శించడమే ఆర్కే లక్ష్యంగా పెట్టుకున్నారు. మోదీ విషయంలో ఆర్కే ఎప్పుడూ సమర్థింపుగా లేరు ానీ… ఇలా ప్రకృతే చూసుకుంటుందన్నట్లుగా శాపనార్థాలు పెట్టడం ఇప్పుడే మొదటి సారి. ఇలా ఎందుకు ఆర్కే ఎమోషనల్ అయ్యారో మరి !