యూట్యూబ్ చానళ్లు చేస్తున్న ప్రచారాలపై కేటీఆర్ తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. వారు పెడుతున్న థంబ్ నెయిల్స్ ఆయనను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. సహనం నశించి పోవడంతో ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టి అందర్నీ హెచ్చరించారు. శుద్ధ అబద్దాలు, ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్దంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. అడ్డమైన తంబునెల్స్ తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. చానళ్లను నిషేధించాలని యూట్యూబ్‌కు కూడా లేఖలు రాస్తామన్నారు. ఇప్పటికే తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.
కేటీఆర్ ఏ యూట్యూబ్ చానళ్లను చూసి .. ఆగ్రహానికి గురవుతున్నారో స్పష్టత లేదు. కానీ కవిత అరెస్ట్ బీఆర్ఎస్ రాజకీయ పరిణామాలను బట్టి యూట్యూబ్ చానళ్లు రకరకాలుగా థంబ్ నెయిల్స్ పెట్టి వార్తలు రాస్తున్నాయి.ఇలాంటి వాటిలో కొన్ని కేటీఆర్ దృష్టికి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటే.. బీఆర్ఎస్ కార్యక్రతలు నేరుగా దాడులు చేసేవాళ్లు. క్యూ న్యూస్ పై ఎన్ని సార్లు దాడులు చేశారో లెక్కలేదు. ఇప్పుడు అలా చేయలేరు.. కేసులవుతాయి.. అందుకే కేటీఆర్ చట్టపరమైన హెచ్చరికల్ని పంపుతున్నారు.
అయితే కాంగ్రెస్ పైన, రేవంత్ పైన… టీడీపీ పైన.. బీఆర్ఎస్ స్పాన్సర్డ్ సోకాల్డ్ యూట్యూబ్ జర్నలిస్టులు చేసిన వీడియోలపై ఎంత దుమారం రేపినా… ఆ పార్టీల వాళ్లు ఎంత గగ్గోలు పెట్టినా…కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్లయినా పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు.