హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మీర్జా పేరు పరిశీలిస్తున్నారు. సానియా సోదరిని అజహర్ కుమారుడు వివాహం చేసుకున్నారు. బంధుత్వం కూడా ఉంది. ఈ క్రమంలో సానియా పేరును అజహర్ తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ మస్కతితో పాటు ఫిరోజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. అనూహ్యంగా సానియా పేరు రావడంతో ఆసక్తికరంగా మారింది. అయితే మజ్లిస్ తో పోరాడాలా.. లోపాయికారీ సహకారంతో ముందుకెళ్లాలా అన్నది ఖరారు చేసుకున్న దాన్ని బట్టి అభ్యర్థిని ఫైనల్ చేస్తారు
ఇంకా నాలుగు సీట్లకు అభ్యర్థుల్నిప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే మూడు విడుతలుగా 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ స్థానాలకు నేడు అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, మల్లు నందిని, తుమ్మల యుగంధర్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వంకాయలపాటి రాజేందప్రసాద్ పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఆ జిల్లాకు చెందిన మంత్రుల కుటుంబాల నుంచి ముగ్గురు టికెట్ ఆశిస్తుండటంతో వారందరినీ పక్కన పెట్టి రాజేంద్రప్రసాద్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
వరంగల్ సీటు కోసం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌తో పాటు డి. సాంబయ్య, అద్దంకి దయాకర్ పోటీ పడుతున్నారు. ఇది ఇలాఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు అతని కూతురు, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో మొదటి నుంచి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వారికి ఆశా భంగం తప్పదని రాజకీయ వర్గాలంటున్నాయి. పార్టీ మారిన సిట్టింగ్ ఎంపీ పసూనూరి సీటు గ్యారెంటీతోనే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే చివరి వరకు ఎవరికి సీటు దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
కరీంనగర్ టికెట్ కోసం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సంతోష్ కుమార్ మొదటి నుంచి పోటీ పడుతున్నారు. అల్గిరెడ్డి పేరు ఖరారైందని వార్తలు వచ్చినప్పటికి చివరి క్షణంలో తీన్మార్ మల్లన్న పేరు తెరపైకి వచ్చింది.