రేవంత్ రెడ్డి పదవి చేపట్టి నాలుగు నెలలు అయింది. ఈ నాలుగు నెలల్లో కొడంగల్ కోసం చాలా జీవోలిచ్చారు. ఎన్ని పనులు ప్రారంభమయ్యాయన్నది ఎవరికీ తెలియదు కానీ.. అన్నీ చేసేసినట్లుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. అయితే కొడంగల్లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుందో..రాదోనన్న అనుమానంలో ఉన్నారేమో కానీ.. ఎందుకైనా మంచిదని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించేశారు. వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ప్రచారసభలో పాల్గొని.. తనను దెబ్బకొట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించేశారు.
కొడంగల్ మెజార్టీ రాకపోతే.. రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఇబ్బందికరమే. కానీ రాదని ఆయన ఎందుకు అనుకుంటున్నారన్నదే ఇక్కడ అసలు సమస్య. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగాల్సినంత క్లిష్టపరిస్థితులు ఇప్పుడు లేవు. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. ఆయన సోదరుడే రేవంత్ ప్రత్యర్థి. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ.. అన్నమాట జవదాటని తమ్ముడని పేరుంది. అంటే.. ప్రత్యర్థి లేనట్లే. ఇక బీఆర్ఎస్ నేతల్ని మండలాల వారీగా టార్గెట్ పెట్టుకుని మరీ కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఎలా చూసినా.. బీఆర్ఎస్ పోటీ ఇచ్చే స్థితిలో లేదు. బీజేపీ ఉనికి లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో కొడంగల్ లో అసెంబ్లీలో వచ్చిన మెజార్టీ కన్నా.. పార్లమెంట్ ఎన్నికల్లో వస్తుందనే అనుకుంటున్నారు. కానీ కుట్రలు జరుగుతున్నాయని.. పాలమూరు బిడ్డను లాగేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమోషనల్ అవుతున్నారు. ఎలాగైనా ఓట్లు సంపాదించడమే ముఖ్యమని రేవంత్ తొందరపడి ఈ అస్త్రాన్ని వాడేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.