వరంగల్ లోక్సభ అభ్యర్థిపై కేసీఆర్ పార్టీని అంటి పెట్టుకుని ఉన్న నేతలకే చాన్సివ్వాలని భావిస్తున్నారు. టిక్కెట్ రేసులో ఉన్న ప్రధాన దళిత నేతలంతా గుడ్ బై చెప్పడంతో… అభ్యర్థి ఎంపిక క్లిష్టంగానే మారింది. కడియం బయటకు వెళ్లిపోగానే… మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరిగింది.
బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేకపోయారు. ఆ పార్టీ చేర్చుకోలేదు. ఎటూ కాకుండా పోయారు. అందుకే కేసీఆర్ పిలిస్తే చాలు ఆయన చేరిపోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ ఆయనకు పిలుపు వెళ్లలేదు. బీఆర్ఎస్ అధిష్టానానికి రాజయ్యపై కూడా నమ్మకం లేకపోవటమే ఇందుకు కారణం. చిన్న కారణాలతో పార్టీ మారిన ఆయన్ను అంతగా విశ్వసించలేమని బీఆర్ఎస్ బాస్ భావిస్తున్నారు.
అభ్యర్థి ఎంపికపై వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్లతోపాటు పార్టీలోని ముఖ్య నేతలతో ఆయన గత కొద్ది రోజులుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఉద్యమ నేత పరంజ్యోతి, హన్మకొండ జడ్పీ చైర్పర్సన్ సుధీర్ కుమార్ తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకర్ని ఎంపిక చేసి ప్రకటించే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కడియం కావ్యకు సరైన పోటీ రాజయ్యే అవుతారని.. ఆయననే దింపాలని కొంత మంది నేతలు కేసీఆర్ కు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.