బీబీసీ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఇండియాలో తన లైసెన్స్‌ను తన మాజీ ఉద్యోగులు పెట్టిన కంపెనీకి అప్పగించింది. భారత్‌లోని తన న్యూస్రూమ్ను మూసేసింది. నలుగురు బిబిసి మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్’ పేరిట ఏర్పడిన ప్రయివేటు లిమిటెడ్ కంపెనీకి బిబిసి ప్రచురణ లైసెన్సును అప్పగించింది.
1940లో భారత్ లో బీబీసీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్ల కిందట ప్రాంతీయ భాషల్లోనూ ప్రారంభించింది. కరోనా తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది బీబీసీ. అయితే 2021లో కేంద్రం దేశీయ డిజిటల్ మార్కెట్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతమేనని తేల్చింది. ఆ పరిమితి దాటిన కంపెనీలు తమ విదేశీ పెట్టుబడులను నియంత్రణలకు అనుగుణంగా తగ్గించుకోవాల్సి వచ్చింది.
బిబిసి ఇండియాలో 99.9 శాతం ఎఫ్‌డిఐ కావడంతో ఆ కొత్త నిబంధన గుది బండగా మారింది. విధి లేని పరిస్థితులలో కార్యకలాపాలను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కలెక్టివ్ న్యూస్ రూమ్ కు బీబీసీ పూర్తి మద్దతు ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేసింది బీబీసీ మాజీ ఉద్యోగులే. బీబీసీని టార్గెట్ చేసి గతంలో దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించిన తర్వాత నుంచే.. అసలు ఆ సంస్థను సాగనంపే కార్యక్రమాలు జరిగాయి. బీబీసీకి ఇండియాలో చోటు లేకపోవడం.. ఓ రకంగా భారత్ ఇమేజ్ ను.. ప్రపంచ మీడియా రంగంలో కాస్త పలుచన చేసేదేనని నిపుణుల అభిప్రాయం.