వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో భారీ మార్పు చేర్పులు చోటు చేసుకోవడ ఖాయంగా కనిపిస్తోంది. పలు చోట్ల అభ్యర్థులు లేక ఎవరినో ఒకరిని ఖరారు చేసిన వైసీపీ అధినేత ఇప్పుడు ఇతర పార్టీల వారికి ఆఫర్లు ఇచ్చి చేర్చుకుంటున్నారు. పలు నియోజకవర్గాల నుంచి వైసీపీలో చేరుతున్న నేతలంతా టిక్కెట్ల ఆఫర్‌తోనే చేరుతున్నారు
పోతిన మహేష్ ను తాజాగా వైసీపీలో చేర్చుకున్నారు. పవన్ కల్యాణ్ కుటుంబాన్ని కూడా విమర్శించిన ఆయనకు వైసీపీ ఆఫర్ ఇచ్చిందని మొదట్లోనే అర్థమైపోయింది. ఇప్పుడు ఆయనకు విజయవాడ పశ్చిమ టిక్కెట్ ఖరారు చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే కర్నూలు ఎంపీ స్థానాన్ని కూడా మార్చబోతున్నారు. టీడీపీ లో ఉన్న కేఈ ప్రభాకర్ కు కండువా కప్పి టిక్కెట్ ఖరారు చేయబోతున్నారు. ప్రస్తుతం కర్నూలు మేయర్ బీవై రామయ్యను అభ్యర్థిగా ఖరారు చేశారు.
ఆయనకు ప్రతీ సారి ఇలాగే హ్యండిస్తున్నారు. ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్న సమయంలోనూ అదే పని చేస్తున్నారు. కేఈ కృష్ణమూర్తి కుమారుడు ఇప్పటికే డోన్ నుంచి పోటీ చేస్తున్నారు. కేఈ ప్రభాకర్ కు సీటు నిరాకరించడంతో ఆయన సైలెంట్ గా ఉన్నారు. కానీ వైసీపీ పిలిచి మరీ ఆఫర్ ఇస్తోంది. ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానంలో పోటీకి రోశయ్య విముఖంగా ఉన్నారు. ఆ సీటు మార్చాల్సిందే. ఇక పి.గన్నవరం నియోజకవర్గంలోనూ పాత వైసీపీ లీడర్ పాముల రాజేశ్వరి దేవిని చేర్చుకున్నారు. ఆమెకూ టిక్కెట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.
మైలవరంతో పాటు కనీసం పది స్థానాల్లో కొత్త నేతలకు టిక్కెట్లు ఇవ్వనున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పు చేర్పుల కారణంగా మరింత గందరగోళం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.