తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మార్మోగిన నినాదం మార్పు కావాలి. ఒక్క మాట కాంగ్రెస్ కు ఎంతో మేలు చేయగా… తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలనకు ముగింపు పలికింది. నాటి నుండి నేటి వరకు సీఎం రేవంత్ రెడ్డి తన స్పీచ్ లో మార్పు తెస్తున్నాం మాటకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
అయితే, కేసీఆర్ అనగానే… ఎవరినీ కలవడు, ఫాంహౌజ్ కే పరిమితం అవుతారు, తను కలవాలనుకుంటే తప్పా ఎవరికీ ఫాంహౌజ్ కు అనుమతి ఉండదు అనేది అందరికి తెలిసిందే. కానీ అధికారం పోయాక కానీ ఆయనకు అసలు తత్వం బోధపడినట్లు లేదు.
అధికారం పోయాక పార్టీ నుండి నేతలు చేజారుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ఎప్పుడు షాకిస్తారో తెలియని పరిస్థితి. ఇక కేసీఆర్ ఇప్పుడు కూడా మారకపోతే బీఆర్ఎస్ ఇక మరోసారి అధికారంలోకి రావడం కలే అని సొంత పార్టీ నాయకులే కామెంట్ చేసిన పరిస్థితుల్లో… కేసీఆర్ రియాల్టిలోకి వస్తున్నట్లుగా కనపడుతోంది.
ఈ మధ్య కేసీఆర్ నందినగర్ ఇంటికన్నా ఫాంహౌజ్ కే ఎక్కువగా పరిమితం అవుతున్నారు. పార్టీ సమావేశాలకు అక్కడి నుండే వెళ్తున్నారు. నాయకులను కూడా అక్కడికే పిలిచి మాట్లాడుతున్నారు. అయితే, గత 15రోజులుగా ద్వితీయ శ్రేణి నేతలతో పాటు నాయకుల వెంట వచ్చే కొద్ది మంది క్యాడర్ ను కూడా కేసీఆర్ కలుస్తున్నారు. ఎంతో కొంత సమయం వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ… ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మా సారు మారారు… అంటూ సెకండ్ గ్రేడ్ క్యాడర్ హ్యపీగా ఫీల్ అవుతున్నారు.
అయితే, ఇదంతా పార్లమెంట్ ఎన్నికల స్టంట్ అని… ఎన్నికలయ్యాక కేసీఆర్ ఎప్పుడు దర్శనం ఇస్తారో కూడా తెలియదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ అంటేనే ఏ పూటకు ఆ పూట రాజకీయం చేసే టైపు… ఆయన్ను పూర్తిగా ఇప్పుడే నమ్మలేం అనే వారు కూడా లేకపోలేదు.