రిటైరైపోయినా సరే పొడిగింపులు తెచ్చుకుని మరీ ఓఎస్డీగా పోలీస్ డిపార్టుమెంటులో పవర్ చెలాయించిన డీసీపీ రాధాకిషన్ రావు క్రైమ్ కథలు చిలువలు పలువలుగా బయటకు వస్తున్నాయి. ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన పొలిటికల్ స్కెచ్లు లెక్కలేనన్ని వేశారు. ఇదే అదనుగా ఆయన సెటిల్మెంట్లు చేసి సొమ్ము చేసుకున్నారు. బుధవారం ఆయనపై ఓ కేసు నమోదైంది. ఆ కేసు పూర్వపరాలు చూస్తే.. చేతిలో గన్ను ఉన్న పోలీసులు దారి తప్పిదే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయో అర్థమైపోతుంది..
ఓ కంపెనీని ఇతరుల పేరు మీద బదలాయించేసిన రాధా కిషన్ రావు
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు పై మరో కేసు నమోదైంది. క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్లతో కలిసి తనపై ఉన్న షేర్లు బలవంతంగా రాయించుకున్నారని చైర్మన్ వేణుమాధవ్ చెన్నుపాటి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలు పరిశీలించిన పోలీసులు రాధా కిషన్ రావుతో సహా ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ ఐ మల్లికార్జున్ పలువురు పోలీస్ అధికారులపై కేసు నమోదు చేశారు.
ఎన్నారై స్థాపించిన క్రియా హెల్త్ కేర్
వేణుమాధవ్ చెన్నుపాటి అనే ఎన్నారై.. విదేశాల్లో చదువుకుని .. ప్రపంచ బ్యాంక్లో ఉద్యోగం చేసి.. భారత్లో కంపెనీ పెట్టాలని తిరిగి వచ్చారు. హెల్త్ కేర్ సొల్యూషన్స్ కంపెనీ క్రియా హెల్త్ కేర్ ను పెట్టారు. ఈ సంస్థ 2014 ఏపీలో కొన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ల నిర్వహణతో పాటు కొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్ నిర్వహణ చేపట్టింది. మొదట ఈ కంపెనీకి వేణుమాధవ్ చెన్నుపాటి పూర్తి స్థాయి ఓనర్ గా ఉండేవారు. ఆ సమయంలో ఇతరులు కంపెనీలోకి వచ్చారు. స్వల్ప పెట్టుబడితో గోపాల్ , రాజ్ , నవీన్, రవి అనే వ్యక్తుల్ని 2016-17లో డైరక్టర్లుగా చేర్చుకున్నారు. అరవై శాతం వేణుమాధవ్ చెన్నుపాటికి షేర్లు ఉండగా.. మిగతా నలుగురికి తలా పది శాతం షేర్లు ఉన్నాయి. తర్వాత సంస్థను విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా యూపీలో కూడా ఓ కాంట్రాక్టర్ కోసం టెండర్ దాఖలు చేశారు. అప్పట్నుంచి వేణుమాధవ్ షేర్లు అమ్మాలని నలుగురూ కలిసి ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
గోల్డ్ ఫిష్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ నమ్మించి మోసం
తన కంపెనీలో మైనర్ పెట్టుబడిదారులు పెడుతున్న టార్చర్.. షేర్లు అమ్మాలని చేస్తున్న ఒత్తిడిని.. తన ఇంటి పక్కన ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన చంద్రశేఖర్ వేగేకి వేణుమాధవ్ చెన్నుపాటి చెప్పారు. ఆయన తాను సాల్వ్ చేస్తానని చెప్పి..అతి తక్కువ ధరకు కొన్ని షేర్లను తన పేరుపై బదలాయించుకున్నారు. తర్వాత మిగిలిన డైరక్టర్లతో కలిసిపోయి.. బెదిరింపులకు దిగారు. కంపెనీ స్వాధీనం కోసం కుట్ర పన్నారు. అందరూ మోసం చేయడంతో వేణుమాధవ్ చెన్నుపాటి పోలీసుల్ని ఆశ్రయించారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు.
రాధాకిషన్ రావు సాయంతో కిడ్నాప్ చేసి బెదిరించి షేర్లు బదలాయింపు
కానీ నిందితులతో కలిసి డీసీపీ రాధాకిషన్ రావు .. వేణుమాధవ్ ను.. కిడ్నాప్ చేయించారు. కేసు పేరుతో తీసుకెళ్లి తుపాకులు చూపించి బెదిరించి.. షేర్లు బదలాయించుకున్నారు. 2018 అక్టోబర్లో ఇది జరిగింది. కంపెనీ సీఎఫ్ఓ ను కూడా రాధాకిషన్ రావు ఆఫీసుకు పిలిపించి బెదిరించి.. షేర్ల బదలాయింపు పూర్తి చేశారు. వేణుమాధవ్ చెన్నుపాటి ఫిర్యాదుతో నమోదైన కేసు దర్యాప్తులో .. బయటపడే విషయాలు కీలకం కానున్నాయి.