ఏపీలో రాజకీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జనసేన, భాజాపా ఓ కూటమిలా ఏర్పడి, జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూటమి మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా సైలెంట్ సపోర్ట్ అందుతోంది. చిత్రసీమకు పవన్‌కు అభిమానులు చాలామంది ఉన్నారు. చాలామంది దర్శక నిర్మాతలు వాళ్లకు సన్నిహితులు. అందులో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఒకటి. నాగవంశీ పవన్ తో సినిమాలు చేశారు. పవన్ సన్నిహితుడు, స్నేహితుడైన త్రివిక్రమ్ ఈ సంస్థకు బాగా కావాల్సిన మనిషి. కాబట్టి… సితార సపోర్ట్ పవన్‌కు తప్పకుండా ఉంటుంది. ఇదే విషయాన్ని `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` టీజర్ రిలీజ్ ఫంక్షన్లో ప్రస్తావించారు నాగవంశీ. పవన్‌కు తమ మద్దతు ఉంటుందని, ఫ్యాన్స్ 12వ తేదీ నాటికి ఏపీ చేరుకొని, 13న ఓటింగ్ లో పాల్గొనాలని, అదే పవన్ కల్యాణ్ కు అభిమానులు చేసే గొప్ప సేవ అంటూ.. వ్యాఖ్యానించారు. అది నిజం కూడా. ఏపీలో ఓటు హక్కు ఉన్న చాలామంది యువత ఇప్పుడు ఉద్యోగాలు చేసుకొంటూ హైదరాబాద్ లో సెటిలైపోయారు. వాళ్లంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూర్లు వెళ్లాలి. ఈ ఓటింగ్ శాతం గెలుపు, ఓటములపై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అదే నాగవంశీ గుర్తు చేశారు.
బయటకు చెప్పకపోయినా, బయట పడకపోయినా కొంతమంది నిర్మాతలు ఇప్పటికే పవన్ వెనుక ఉన్నారు. ఆర్థికంగానూ తమ వెన్నుదన్నులు అందిస్తున్నారు. పవన్ ప్రచారంలో అది ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు నాగవంశీ మాటల్ని బట్టి, సితార కూడా పవన్ వెనుక ఉందన్న విషయం అర్థమైంది. నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`లో విశ్వక్సేన్ హీరో. కృష్ణచైతన్య దర్శకుడు. మే 17న అంటే ఎన్నికల హడావుడి ముగిసిన తరవాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.