రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన పెడితే కడప అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని వీధివీధినా చెప్పుకుంటున్నారు. మౌత్ టాక్ దెబ్బకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వైపు అందరూ జాలిగా చూసే పరిస్థితి ఉంది.
కడప నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై వైసీపీలోనే కాదు ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వైఎస్ ఫ్యామిలీపై అభిమానంతో పార్టీ విజయానికి సహకరించిన కడప కార్పొరేటర్లు.. డిప్యూటీపై తీవ్ర అసంతృప్తితో పార్టీలు మారిపోయారు. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. కడప అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ హయాం నుంచి కాంగ్రెస్, వైసీపీ కంచుకోటగానే ఉంది. కానీ అంతకు ముందు టీడీపీ హవా ఉంది. మూడు సార్లు విజయం సొంతం చేసుకున్నప్పటికీ 2004 ఎన్నికల నాటి నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. నాలుగు సార్లు వరుసగా వైఎస్ ఫ్యామిలీ ఎవర్ని నిలబడితె వారు గెలిచారు.
2004, 2009 ఎన్నికల్లో వైఎస్ అండదండలతో అహ్మదుల్లా వరుసగా రెండు సార్లు గెలిచి.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. 2014లో కార్పొరేటర్‌గా ఉన్న అంజాద్ బాషాకు జగన్ చాన్సిచ్చారు 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచి ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయ్యారు. పేరుకే ఆయన మంత్రి కానీ ఎప్పుడైనా అధికార విధుల్లో కనిపించింది లేదు. కానీ నియోజకవర్గంలో చేసిన అరాచకాలకు మాత్రం అంతు లేకుండా పోయిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి భార్య రెడ్డెప్పగారి మాధవీరెడ్డికి టీడీపీ ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చిన తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఆమె బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ప్రజల్లోకి చొచ్చుకెళ్లిపోయారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాల మహిళ్లో ఆమె ప్రత్యేకమైన అభిమానం సంపాదించుకున్నారు. ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. అంజాద్ బాషా నిర్వాకాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బయటకు వచ్చేలా చేసి.. తాను గెలుస్తున్నానన్న ఓ అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించగలిగారు. కడప మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీకి ప్రధాన బలంగా ఉన్న కార్పొరేటర్లు డిప్యూటీ సీఎంపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. తమ డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు రాక ఎవరిని అడగాలో అర్ధం కాక ఎమ్మెల్యే కూడా పట్టించుకోక పోతుండటంతో వారిలో అసంతృప్తి పెరిగిపోయింది.
బలమైన నాయకత్వం ఉంటే వైసీపీకి ఎంత బలమైన సీటులో అయినా టీడీపీ గెలిచే పరిస్థితికి వస్తుందని రెడ్డప్పగారి మాధవి నిరూపిస్తున్నారు. కడపలో ఆమె ప్రచార స్టైల్ చూసిన వారు.. ఖచ్చితంగా ఆమెకు ఓటు వేయాలని అనుకుంటారని టీడీపీ నేతలే ప్రశంసిస్తున్నారు. తన అభిప్రాయాలను బలంగా వినిపించడం బాధితుల పక్షాన ఉండటం.. ప్రతీ విషయంపైనా స్పష్టత ఉండటంతో రెడ్డప్పగారి మాధవి కడప రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తారని గట్టి నమ్మకం ఏర్పడింది.