ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు అలా అనుకోనీయడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తుల్ని కూడా రాత్రికి రాత్రి రాయించుకుంటున్నారు. రాసేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో మార్చేసుకుంటున్నారు. అంతే కాదు అలాంటి పరిస్థితుల్లో బాధితులు కోర్టులకు వెళ్లకుండా చట్టం చేసేశారు.
ఒంగోలులో భూ మాఫియా స్కాంలో ఏం జరిగిందో తెలుసా ?
ఓ స్థలానికి సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి… వాటి ద్వారా అసలు యజమానుల్ని బెదిరించి… పదో పరకో ఇచ్చి ఆస్తుల్ని కొట్టేయడం భూమాఫియా స్కాం. ఇది ఒంగోలులో బయటపడింది. కానీ రాష్ట్రమంతా అనేక చోట్ల ఇలాంటి వి జరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. బయటకు వచ్చింది తక్కువ. ఆస్తులు రాయించుకుంటున్నా ప్రాణభయంతో బయటకు రాలేని వాళ్లుఎక్కువగా ఉన్నారు. ఏ వ్యవస్థ కూడా న్యాయం వైపు నిలబడుతుందన్న నమ్మకం ప్రజల్లో లేదు.
అసలు న్యాయం కోసం పోరాడకుండా చట్టం చేసిన జగన్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్- 2022’ను తీసుకొచ్చింది. సాంకేతికంగా 2023 అక్టోబరు 31 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం ఆస్తి సర్వే చేసి ఎవరి పేరు మీద నమోదు చేస్తారో వారిదే స్థలం, ఇల్లు, పొలం, గట్రా. వీఆర్వో, ఆర్ఐ, తహశీల్దార్, సివిల్ కోర్టులు, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ, సబ్ రిజిస్ట్రార్, సివిల్ కోర్టులు ఎవరూ వివాదాల్లో జోక్యం చేసుకోలేరు. అంటే చివరికి కోర్టులు కూడా దాన్ని కాదనలేవు. మీ భూమి సమస్య మీద ఇకపై సివిల్ కోర్టుల్లో దావాలు వేయడం కుదరదు. ఇక ఏ సమస్య అయినా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీరుస్తారు. ఆయన తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాలి. వీళ్లద్దరి తీర్పుతో సంతృప్తి చెందకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్లాలి.
ఐదేళ్ల పాటు జరిగిన మాఫియా ఘోరాలకు.. చట్టబద్ధత కోసం తెచ్చినట్లుగా లేదూ !
ప్రస్తుతం భూ వివాదాలను కోర్టుల్లో పరిష్కరిస్తున్నారు. , కొత్త చట్టం ప్రకారం కోర్టులకు బదులు కొందరు అధికారులు తేలుస్తారు. ఈ అధికారులు ఎంత బాగా పని చేస్తారో కళ్ల ముందే ఉంది. ఈ తీర్పు చెప్పే అధికారిగా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు. తర్వాత అప్పీల్ చేసుకునేవారు కూడా ప్రభుత్వ అధికారులే. వారంతా ప్రభుత్వ మాఫియా గుప్పిట్లో ఉంటారు. ఇక్కడ విషయం ఏమిటంటే.. టైటిల్ రిజస్ట్రేషన్ ఆఫీసర్ నోటీసులు.. విచారణలు చేయకుండానే తనకు ఇష్టం వచ్చిన వారికి ఆస్తి రాసేయోచ్చు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తప్పు చేసినట్లుగా తేలినా శిక్ష ఉండదు.
అంటే… మొదట భూముల్ని వివాదాల్లోకి నెట్టేలా కుట్ర పన్నారు. వాటిని సొంతం చేసుకునేందుకు చట్టంతెచ్చారు. అమలు ప్రారంభించారు. మరొక్క సారి ఓటేస్తే… ఇక పంజా విసురుతారు. అప్పుడు కాపాడేందుకు కూడా ఎవర రాలేరు. ఎందుకంటే చట్టాల గురించి తెలిసి కూడా ఓటేస్తే.. ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు ?