బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు ఉన్నారా..? బీఆర్ఎస్ నుంచి వచ్చే షిండే సిద్ధిపేట ఎమ్మెల్యేనా..?
ఈ అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావును బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించి రాజకీయాల్లో పెద్ద చర్చకు తెరలేపారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై తాను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే తెలివిగా హరీష్ రావును సవాళ్ళ పేరిట తెరమీదకు తీసుకొచ్చారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
హరీష్ రావుతో రేవంత్ రెడ్డికి చీకటి ఒప్పందం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం వెనక హరీష్ రావు హస్తం ఉందని ప్రచారం జరగగా.. తాజాగా మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఉనికిపై అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి.
బీఆర్ఎస్ నుంచి షిండేగా హరీష్ రావు అవతరిస్తారని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి – హరీష్ రావు మధ్య చీకటి ఒప్పందం ఉందని, కాంగ్రెస్ లో చేరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్నది హారీష్ రావేనా అంటూ ప్రశ్నించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.