బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది. అదే ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఉపఎన్నిక. మూడేళ్ల క్రితం ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ స్థానం నుంచి గెలిచారు. ఆయన జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దాంతో రాజీనామా తప్పనిసరి అయింది.
ఉపఎన్నిక వచ్చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించారు. ఆయన గతంలోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో ఉన్నారు. బీఆర్ఎస్ కు ఇది సిట్టింగ్ స్థానం. తమ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా వల్ల వచ్చిన ఉపఎన్నిక. అందుకే గెలవడం మరింత ప్రతిష్టాత్మకం. కానీ ఇప్పుడు అభ్యర్థిగా ఎవరిని దింపాలన్నది సమస్యగా మారింది. ఎవరూ పోటీకి ముందుకు రావడం లేదు. ప్రచార గడువు కూడా లేదు. మే రెండోతేదీ నుంచి నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ 13వ తేదీన జరుగుతుంది.
అభ్యర్థిని నిలబెడితే గెలవాలని కనీసం రెండో స్థానంలో ఉండాలి. కనీస ఓట్లు కూడా రాకపోతే పరువుపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ది అదే పరిస్థితి. పోటీ చేస్తే కనీస ఓట్లు వస్తాయన్న నమ్మకం లేదు. పోటీ చేయకపోతే పారిపోయారని అంటారు. ఏం చేయాలన్నది వారం రోజుల్లో డిసైడ్ చేసుకునే అవకాశం ఉంది.