సీనియర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా తమ భుజాలపైనే నడవాలని కోరుకోవడం లేదు. కథలో భాగం అయితే చాలనుకొంటున్నారు. అందుకే వాళ్లకు మంచి పాత్రలు దక్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాటలో నడుస్తున్నారు. నాగ్ ఇప్పుడు మల్టీస్టారర్లపై దృష్టి పెట్టారు. ఆయన ఎంచుకొంటున్న కథలన్నీ అలాంటివే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, ధనుష్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘కుబేర’లో నాగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ కూడా షూటింగ్ లో పాలు పంచుకొంటున్నారు. రజనీకాంత్ సినిమాలో నాగ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో నాగార్జున మార్కెట్ మరింత పెరగడం ఖాయం. మరోవైపు అక్షయ్‌కుమార్‌తో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడానికి దాదాపుగా రంగం సిద్ధమైంది. నవీన్ ఈ చిత్రానికి దర్శకుడు. జ్ఞాన్వేల్ రాజా నిర్మాత. షూటింగ్ లో సింహభాగం లండన్‌లో జరగబోతోంది. ఇప్పటికే లొకేషన్ రెక్కీ కూడా పూర్తయ్యింది.
అయితే… సోలో హీరోగానూ నాగ్ బిజీగా ఉండాలనుకొంటున్నారు. ఈ సంక్రాంతికి `నా సామిరంగ` అంటూ హడావుడి చేశారు నాగ్. 2025 సంక్రాంతికీ ఓ సినిమా విడుదల చేయాలన్న భావనలో ఉన్నారు. అందుకోసం కొన్ని కథలు వింటున్నారు. `నా సామిరంగ` ఫేమ్ బిన్నీ చెప్పిన కథకు నాగ్ పచ్చ జెండా ఊపారని సమాచారం అందుతోంది. దాంతో పాటు సుబ్బు అనే కొత్త దర్శకుడికీ నాగ్ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. ఇవి రెండూ సోలో హీరో కథలే. కాకపోతే కీలకమైన పాత్రల్లో కొంతమంది స్టార్లు కనిపించే అవకాశం ఉంది. అలా.. ఇవి కూడా మల్టీస్టారర్లు అయిపోతాయి.