కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం .. జగన్ సతీమణి భారతిరెడ్డి రంగంలోకి దిగారు. ఆమె గత ఎన్నికల్లో పులివెందులలో ప్రచారం చేశారు. ఆమె ప్రచార స్టైల్ భిన్నంగా ఉంటుంది. జగన్ గెలిస్తే మీ ఇంటికి ఇన్ని డబ్బులొస్తాయని చెబుతూ ఉంటారు. పోయిన సారి ఆమె చేసిన ప్రచార వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.
షర్మిల కోసం.. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. సునీత ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ కోసం..రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన షర్మిల ఒకటో తేదీ నుంచి పూర్తిగా కడప నియోజకవర్గానికే పరిమితమవనున్నారు. ఆమె కోసం రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ వంటి వారు ప్రచారం చేసే అవకాశం ఉంది. షర్మిల కోసం .. బ్రదన్ అనిల్ పరోక్ష ప్రచారం ప్రచారం ప్రారంభించారు., కడపలో చర్చి పాస్టర్లతో సమావేశాలు పెట్టి పాపాలు చేసిన వాళ్లను తొక్కి పడేయాలని పిలుపునిస్తున్నారు. షర్మిల కోసం చాలా మంది కుటుంబసభ్యులు బయటకు వస్తున్నారు. బయటకు రాలేని వాళ్లు అంతర్గతంగా మద్దతు తెలుపుతున్నారు.
ఈ సారి ఎన్నికల ప్రచారంలో వైఎస్ విజయలక్ష్మి కనిపించే అవకాశం లేదు. గతంలోకుటుంబం అంతా ఏదో చోట ప్రచారం చేస్తూనే ఉండేవారు. ఈ సారి మాత్రం ఎవరికి వారు అయ్యారు. ప్రధానంగా కడపకే పరిమితమవుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత వైఎస్ కుటుంబంలో చీలిక పూర్తి స్థాయిలో బయటకు రానుంది.