ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్కడ విన్నా, రాజకీయాలకు సంబంధించిన అంశాలే. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? అనే చర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్లకు కొంతకాలం పుల్ స్టాప్ పెట్టేసిన వేళ.. ఈ వారం రెండు సినిమాలు బాక్సాఫీసు ముందుకు వస్తున్నాయి. ఆ ఒక్కటీ అడక్కు, ప్రసన్నవదనం ప్రేక్షకుల్ని పకలరించబోతున్నాయి. నెల రోజులుగా వెండి తెరపై సరైన బొమ్మ పడలేదు. ఎన్నికలు అయ్యేంత వరకూ బాక్సాఫీసు దగ్గర సందడే కనిపించదని అంతా ఫిక్సయిపోయారు. సినిమా వచ్చినా, మౌత్ టాక్ ఉంటేనే జనం వెళ్తున్నారు. ఈ దశలో.. ఈ రెండు సినిమాల పరిస్థితి ఏమిటి? రాంగ్ టైమింగ్ లో వస్తున్నాయా? అనేది ప్రధానమైన ప్రశ్న.
నరేష్ చాలారోజుల తరవాత తనదైన కామెడీ టైమింగ్ తో చేసిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈవీవీ సూపర్ హిట్ సినిమాల టైటిల్‌ని వాడుకోవడం నరేష్‌కు ఇదే తొలిసారి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. కచ్చితంగా సినిమాలో ఏదో మంచి పాయింట్ ఉందన్న సంగతి అర్థం అవుతోంది. `ఓం భీమ్ బుష్`తో కామెడీ సినిమాలకు రోజులు చెల్లిపోలేదన్న విషయం తేటతెల్లమైంది. నరేష్ ది కామెడీ మార్క్. ఆయన నవ్విస్తే సినిమా హిట్టే. మరి `ఆ ఒక్కటీ అడక్కు`కు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.
వెరైటీ కథల్ని ఎంచుకొంటూ కెరీర్‌ని ముందుకు తీసుకెళ్తున్నాడు సుహాస్. ఇటీవలే `అంబాజీపేట మ్యారేజీ బ్యాండు`తో ఆకట్టుకొన్నాడు. ఇప్పుడు `ప్రసన్నవదనం` వస్తోంది. ఓ సీరియస్ పాయింట్ ని పట్టుకొని, అందులో డ్రామా, సస్పెన్స్ మిక్స్ చేశారు. ప్రమోషన్లు కూడా జోరుగానే సాగుతున్నాయి. సుహాస్ ట్రాక్ రికార్డ్ వల్ల బీ,సీ సెంటర్లలో ఈ సినిమాకు టికెట్లు తెగే అవకాశం ఉంది. కాకపోతే.. టైమింగే చాలా ముఖ్యం. ఎన్నికల వేడిలో ఈ సినిమాల్ని జనం పట్టించుకొంటారా? అనేది తేలాల్సివుంది.