తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా పెట్టుకొని పలువురికి మెసేజ్ లు, కాల్స్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో వెంటనే సీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
9844013103 నెంబర్ ద్వారా ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు సీఎస్ శాంతి కుమారి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, సీఎస్ డీపీతో మోసాలకు పాల్పడింది ఎవరు..? సీఎస్ ను టార్గెట్ చేసేందుకే ఎవరైనా ఈ పని చేశారా..?రాజకీయ దురుద్దేశంతోనే ఆమె డీపీతో ఇతరులకు మెసేజ్ లు, ఫోన్లు చేశారా..? అనే కోణంలో సైబర్ క్రైం పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఎలక్షన్ కోడ్ కారణంగా తెలంగాణలో వ్యవస్థలన్నీ సీఎస్ పరిధిలోకి వెళ్ళాయి. దాంతో ఎవరైనా కావాలనే సీఎస్ పై బురదజల్లేందుకు ఈ పన్నాగానికి ఒడిగట్టారా..? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్ గా తీసుకోవడంతో సైబర్ క్రైం పోలీసులు ఎవరు ఈ పనికి పాల్పడ్డారు అనేది గుర్తించే పనిలో పడ్డారు.