తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి రేవంత్ ప్రసంగించడంతో బీజేపీ – కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోన్న వేళ వీటన్నింటికి చెక్ పెట్టేలా సంచలన పరిణామం చోటు చేసుకుంది.
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పలువురికి ఢిల్లీ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని రేవంత్ కు పంపిన నోటిసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యే సమయంలో రేవంత్ వినియోగించిన ఎలక్ట్రానిక్ డివైజ్ లు వెంట తీసుకురావాలని సూచించారు.
రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ బీజేపీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు తాజాగా రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. అయితే, రేవంత్ విచారణకు హాజరు అవుతారా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
రేవంత్ రెడ్డి విచారణకు హాజరు అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా..? అని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఐటీ యాక్ట్ కావడంతో అరెస్ట్ వంటి చర్యలు ఏమి ఉండవంటున్నారు నిపుణులు