సుకుమార్ – అల్లు అర్జున్ కలిస్తే ఏదో ఓ మ్యాజిక్ జరిగిపోతుంటుంది. వీరిద్దరికీ దేవిశ్రీ, చంద్రబోస్ కూడా తోడైతే – ఇక చెప్పాల్సిన పనిలేదు. ‘పుష్ష’లో అది కనిపించింది. ‘పుష్ష 2’లోనూ ఈ కాంబో ‘అస్సల్ తగ్గేదే ల్యే’ అనిపించబోతోంది. అందుకు `పుష్షరాజ్` పాటే ఉదాహరణ. ఆగస్టు 15న పుష్ష 2 విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా పబ్లిసిటీ కంటెంట్ కూడా బయటకు వదులుతున్నారు. బన్నీ పుట్టిన రోజున గ్లింప్స్ వచ్చింది. ఇప్పుడు ‘పుష్షరాజ్’ పాట విడుదల చేశారు. ‘పుష్ష’ గుణగణాల్నీ, తన శక్తియుక్తుల్నీ, లక్షణాల్నీ చెప్పే పాట ఇది. చంద్రబోస్ తనదైన శైలిలో రాశారు. దేవిశ్రీ ఈ హీరో ఇంట్రడక్షన్ పాటను మాస్కి నచ్చేలా, ఫ్యాన్స్ మెచ్చుకొనేలా ట్యూన్ చేశారు. ఇక బన్నీ.. మరోసారి పూనకాలు తెప్పించే పెర్ఫార్మ్సెన్స్ ఇచ్చేశాడు. లిరికల్ వీడియోలో డాన్స్ మూమెంట్స్ చూపించింది తక్కువే కానీ, ఉన్నంతలో అబ్బురపరిచే స్టెప్పులే కనిపించాయి. ఒంటికాలు స్టెప్పు, డాన్స్ చేస్తూ చేస్తూ.. ఫోన్ మాట్లాడడం నచ్చేస్తాయి. చివర్లో గాజు గ్లాసు పట్టుకొని రావడం హైలెట్. ఆ స్టెప్ ఎవరు వేసినా అంత మజా రాదు. బన్నీ వేస్తే వస్తుంది. ఎందుకంటే అది జనసేన సింబల్. ఈ పాటలో అదిరిపోయే స్పెషల్ అట్రాక్షన్ అదే అయ్యింది.
లిరిక్స్ లో కూడా చంద్రబోస్ తన మార్క్ చూపించాడు. `నువ్వు గడ్డం అలా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే` అంటూ పుష్ష మేనరిజాన్నుంచి పాట ఎత్తుకొన్నారు. నువ్వు నిలావాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే.. అంటూ హీరోకు తగిన ఎలివేషన్ ఇచ్చారు. చివర్లో రెండుచేతులతో గడ్డం సవరించుకొంటూ ఈసారి డబుల్ డోస్ గ్యారెంటీ అనే సంకేతాన్ని ఇచ్చారు. మొత్తానికి పుష్ష పాట ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. లిరికల్ వీడియోని సైతం కథ, కాన్సెప్ట్ అర్థమయ్యేలా రూపొందించారు. `పుష్ష` ప్రభంజనానికి ఇది మంచి ఆరంభమే.