టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రోజుకు మూడు ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. ఆ మూడు ప్రచారసభల్లో ఆయన మాట్లాడిన దాంట్లో సగం టీడీపీ మేనిఫెస్టో గురించి ఉంటోంది. అదిపాత మేనిఫెస్టోకానీ.. కొత్త మేనిఫెస్టో కానీ.. నెగెటివ్ గా చెప్పడానికి అయినా సరే కనీసం సగం సమయం వెచ్చిస్తున్నారు.
2014 మేనిఫెస్టో అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. వెబ్ సైట్ నుంచి తీసేశారని కూడా చెబుతున్నారు. కానీ ఆయన చేతిలో మేనిఫెస్టో ఉటుంది. దాన్నిచూపిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. వెంటనే.. కొత్త మేనిఫెస్టోపైనా విమర్శలు ప్రారంభిస్తున్నారు. వాటిలో ఉన్న సూపర్ సిక్స్ పథకాలకు తోడు.. కేజీ బంగారం కూడా ఇస్తామన్నారంటూ యాడ్ చేసి చేస్తున్నారు. వినేవారికి నిజంగా టీడీపీ గెలిస్తే బంగారం ఇస్తామన్నారేమో అన్నంత ఆశ పుట్టేలా చేస్తున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల తర్వాత అమలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇలా చంద్రబాబు కూడా ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జగన్ వల్ల ప్రజల్లోకి వెళ్లిపోతోంది.
ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే తాము ఇచ్చిన హామీలను అమలు చేయక తప్పదు. ప్రభుత్వాలపై నమ్మకం లేకపోవడం అనేది ఉండదు. భారీ ప్రయోజనాలు కల్పిస్తామంటున్నారు.. ఒక్క ఓటు వేస్తే సరిపోతుంది కదా అనుకునేవారు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వారికి జగన్.. టీడీపీకి ఓటు వేయమని చెబుతున్నట్లుగా ప్రసంగిస్తూండటం వైసీపీ నేతల్ని కూడా విస్మయనికి గురి చేస్తోంది. కానీ ఆయనకు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి సైలెంట్ గా ఉండిపోతున్నారు.