తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవలి సిద్దం సభలో వైసీపీ హామీల గురించి తక్కువగా మాట్లాడుతూ.. టీడీపీ సూపర్ సిక్స్ హామీల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు.
వైసీపీ సిద్దం సభలో టీడీపీ సిక్స్ గ్యారంటీస్ ను విశ్వసించకండి అంటూ జగన్ రెడ్డి మాట్లాడుతుండటం కూటమి హామీలపై జనాల్లో చర్చకు దారితీస్తోంది. అమ్మ ఒడి పథకం జగన్ రెడ్డి కుటుంబంలో ఒకరికే ఇస్తే… చంద్రబాబు ఎంతమంది పిల్లలున్నా వారందరికీ తల్లికి వందనంతో చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినా మరో నాలుగేళ్లు 3500లు ఫించనే ఇస్తామని జగన్ రెడ్డి…తాము 4వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇలా వైసీపీ హామీలతో పోలిస్తే టీడీపీ హామీలు జనాలను ఆకర్షిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ , హరీష్ రావు ఆరు గ్యారంటీలు టార్గెట్ గా రాజకీయాలు చేశారు. వారిద్దరి వ్యాఖ్యలను జనం విశ్వసించకపోగా..ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ నేతల కన్నా కేటీఆర్ , హరీష్ ద్వారానే ఎక్కువగా జనాలకు రీచ్ ఆయ్యాయి. ఇప్పుడు అలాంటి పొరపాటే జగన్ రెడ్డి చేస్తున్నారని.. ఇది వైసీపీకి మేలు చేయకపోగా టీడీపీ హామీలపై చర్చకు కారణం అవుతుంది. అనుభవాలు కళ్ళ ముందు ఉన్నప్పటికీ జగన్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నారని వైసీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి.
జగన్ రెడ్డి వైసీపీ అధినేతలా కాకుండా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా మారారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.