ఏదైనా ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, కరెంట్, నీరు వంటివి. ఏపీలో రూ. 43 వేల కోట్లతో రోడ్లేశామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకున్నారు. తర్వాత చిన్న వాయిస్ తో కాకపోతే బాగా వర్షాలు పడి కొట్టుకుపోయాయన్నారు. ఈ మాటలు విన్న వారు అసలు రోడ్లు ఎప్పుడు వేశారు.. ఎప్పుడు కొట్టుకుపోయాయో తెలియక తలలు పట్టుకున్నారు. తర్వాత ఆ రూ. 43 వేల కోట్ల బిల్లులు ఎవరికి ఇచ్చి ఉంటారోనని ఆలోచించడం ప్రారంభించారు.
రాష్ట్రంలో అసలు రోడ్లను అలా వదిలేసినా పర్వాలేదనుకన్నారు సీఎం జగన్. తన ఇంటికి అఘామేఘాలపై ఇరవై కోట్లతో మెయిన్ రోడ్ నుంచి అరకిలోమీటర్ వరకూ శరవేగంగా రోడ్డు వేయించుకున్నారు కానీ.. ఏపీలో మాత్రం ఏ మూల కూడా రోడ్లు వేయాలన్న ఆలోచన చేయలేదు. కనీసం మరమ్మతులు చేయలేదు. ఎప్పుడు సమీక్ష పెట్టిన ఇదిగో వర్షాలు అయిపోగానే రోడ్లు వేయండి.. జూన్ లో జుమ్ముంటూ అందరూ దూసుకుపోతారని చెబుతూంటారు. అదే సాక్షిలో రాస్తూంటారు. ఐదేళ్లు అయింది. ఇప్పటి వరకూ రోడ్లు వేయలేదు. కానీ వేసేశామని.. కొట్టుకుపోయానని చెబుతున్నారు. నమ్మేవాళ్లు ఉంటారని నమ్మకం మరి.
ఏపీ రోడ్ల దుస్థితిపై ప్రతిపక్షాలు ఎన్ని ఉద్యమాలు చేశాయో లె్కక లేదు. టీడీపీ, జనసేన స్వయంగా శ్రమదానం కార్యక్రమాలు కూడా నిర్వహించాయి. కానీ ప్రభుత్వానికి సిగ్గు అనేదే లేదు. కావాలంటే కేసులు పెట్టి అడ్డుకున్నారు కానీ.. తాము బాగు చేయలేదు.. చేయనివ్వలేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఓ వైపు జాతీయ రహదారులు నున్నగా దూసుకుపోయేలా ఉంటే.. వాటిని దిగి రాష్ట్రంలో ఎక్కడికి పోవాలన్నా నానా తిప్పలు పడాల్సిందే. ఇప్పటికీ ఏ మార్పు లేదు. ఎంత ఘోరం అంటే రూ. రెండు వేల కోట్లు ఆసియా బ్యాంక్ నుంచి రోడ్ల కోసం అప్పులు తెచ్చి వాడేసుకున్నారు. కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. ఆ పనులన్నీ ఎక్కడివక్కడే ఉండిపోయాయి.
ఏపీ రోడ్లపై ఎంత మంది ప్రాణాలు పోయాయో లెక్కలేదు. గుంతల్లోపడి పోయిన ప్రాణాలు వందల్లోనే ఉంటాయి. వాహనాల రిపేర్లకు .. యజమానులు వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇతల రాష్ట్రాల లారీల ఓనర్లు జాతీయ రహదారులపై ఉన్న డెలివరీ పాయింట్లకు మాత్రమే వస్తాయని షరతులు పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రజల ఇబ్బందులు ఏ మాత్రం పట్టని సర్కార్ ఇది. ప్రజలకు పది రూపాయలు ఇస్తే.. వారే గతుకుల రోడ్లో నడుములు విరగ్గొట్టుకుంటారో… ప్రాణాలు పోగొట్టుకుంటారో వాళ్లే తేల్చుకుంటారన్నట్లుగా వ్యవహారశైలి ఉంది. రోడ్ల సంగతేమిటని నిలదీసిన ప్రజల్ని.. వైసీపీ నేతలు.. పథకాల డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే రోడ్లు వేస్తామని వెటకారం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
పాలన అంటే.. ప్రజల దగ్గర వసూలు చేసే పన్నుల్ని.. అప్పులు చేసి.. వనరుల కొల్లగొట్టి.. ఓ రూపాయి పంచి.. తాము వందల రూపాయలు నొక్కేయడం కాదు. రాష్ట్రం కోసం.. మౌలిక సదుపాయాల కోసం కొంచెం ఖర్చు పెట్టాలి. అదే పాలన అవుతుంది. లేకపోతే వ్యాపారం అవుతుంది. వైసీపీ అధినేత చేసింది అదే. రాజకీయ వ్యాపారాన్ని రాష్ట్రంతో చేశారు. ఇప్పుడు మేలుకోవాల్సింది ఏపీ ప్రజలే. ఓ సారి చేసిన తప్పును మరోసారి చేస్తే.. ఈ సారి ఏ గోతిలో పడినా లేవలేరు.