సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప సినిమా విషయంలో పెద్ద చర్చే జరిగింది. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించారు బన్నీ. ఈ పాత్ర సమాజంపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని, ఒక స్మగ్లర్ ని హీరోగా చూపించే ట్రెండ్ స్మగ్లింగ్ ని ప్రోత్సహించేలా వుందని ఓ వర్గం మాట్లాడింది.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని చెప్పారు. ” నా పాత్ర ప్రభావం ప్రేక్షకులపై ఉంటుందని నేను అనుకోవడం లేదు. పైగా ఇది కల్పిత కథ అని అందరికీ అర్థమవుతుంది. నా పాత్రను స్ఫూర్తిగా తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. ప్రేక్షకులు చాలా స్మార్ట్. సినిమాను సినిమాలానే చూస్తారు’’అని చెప్పుకొచ్చారు. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-1 సంచలనం విజయం సాధించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధమౌతోంది.