పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు డీజీపీని కూడా ఢిల్లీకి పిలిపించారు. ఎన్నికల తరువాత జరుగుతున్న హింసపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ నోటీసులు జారీ చేసింది. హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ భావిస్తోంది.
నిజానికి పోలింగ్ రోజు మధ్యాహ్నం వరకూ చెదురు, మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ఉంది. కానీ పోలింగ్ సరళి తేడాగా ఉందనుకున్న తర్వాత ఓ పార్టీ విచ్చలవిడిగా హింసకు పాల్పడింది. పోలింగ్ తర్వాత కూడా అది పెరిగిపోయింది. తాము ఎందుకు తగ్గుతామని మరో పార్టీ నేతలు ప్రతి దాడులు ప్రారంభించారు. ఐదేళ్ల కాలంలో ఇలాంటి దాడులను ఊహించని అధికార పార్టీ నేతలు మరింత రెచ్చిపోయారు. వీరికి పోలీసుల నుంచి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లభించింది.
తమకు తొత్తులుగా ఉండే పోలీసు అధికారుల ద్వారా సమాచారం తెలుసుకుని భద్రతా బలగాలు లేని సమయం చూసి దాడులు చేశారు. ఈ విషయంలో యంత్రాగంంలో కొంత మంది కీలక వ్యక్తులు సైతం ఉన్నారు. అత్యున్నత స్థాయిలో దాడులకు సహకారం లభించినట్లుగా అనుమానిస్తున్నారు. సీఎస్, డీజీపీ ఢిల్లీ పర్యటనల తర్వాత ఈసీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.