తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సంబంధిత మంత్రులు లేకుండా రేవంత్ సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది.
బుధవారం సచివాలయంలో వ్యవసాయ సంబంధిత అంశాలపై సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ రావు హాజరు కాలేదు. అయితే,వీరికి సమాచారం లేక హాజరు కాలేదా..? లేక రేవంత్ తీరు నచ్చకే దూరంగా ఉన్నారా..? అనే చర్చ జరుగుతోంది.
ఈ సమావేశంలో రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ళపై అధికారులకు రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ చేయలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆ శాఖ మంత్రితో చర్చంచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక శాఖ మంత్రి భట్టి లేకుండానే రుణమాఫీపై రేవంత్ ఆదేశాలు ఇవ్వడం పట్ల పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల లేకుండా ధాన్యం కొనుగోళ్ళపై సమీక్ష నిర్వహించడమే కాకుండా, ఆదేశాలు ఇవ్వడం పట్ల పార్టీలో సరికొత్త సందేహాలకు ఈ పరిణామం దారితీస్తోంది. గతంలో సైతం మంత్రి తుమ్మల లేకుండానే వ్యవసాయ శాఖపై రేవంత్ సమీక్ష నిర్వహించారు.ఆ కారణంగానే మల్కాజ్ గిరి లోక్ సభ ఇంచార్జ్ గా ఉన్న తుమ్మల అక్కడ నిర్వహించిన రివ్యూకు డుమ్మా కొట్టారన్న వాదనలు వినిపించాయి.
అయితే, ఖమ్మం ఎంపీ సీటు విషయంలో తుమ్మలకు రేవంత్ సహకరించలేదని అసంతృప్తే ఈ గ్యాప్ కు కారణమా అనే చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా, భట్టి ఎందుకు ఈ రివ్యూకు గైర్హాజరు అయ్యారన్నది ఆసక్తికరంగా మారింది.