ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో హింసపై తమ వాదన వినిపించారు. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నందున వారి వాదనను ఈసీ ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందో కానీ..చేతకాని తనంపై గట్టిగానే హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
కౌంటింగ్ కోసం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకునేందుకు ఈసీ సిద్దమయింది. నలుగురు, ఐదుగురు ఎస్పీలతో పాటు కీలక అధికారుల్ని మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. సీఎస్, డీజీపీ తిరిగి హైదరాబాద్ చేుకునేలోపే కఠిన చర్యలను ప్రకటించే అవకాశం ఉంది. సీఎస్ ను మార్చాలన్న డిమాండ్ టీడీపీ ఎప్పటి నుంచో చేస్తుంది. ఆయన అండతోనే అరాచకాలన్నీ జరిగాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలో సీఎస్ విషయంలో ఈసీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
పోలింగ్ ముగిసిన తర్వాతనే ఇలా ఉంటే.. ఇక కౌంటింగ్ తర్వాత ఎలా ఉంటుందోనన్న ఆందోళన సాధారణ ప్రజల్లో ఉంది. ఈసీ కూడా ఇదే విధంగా ఆలోచిస్తోంది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకూ ఈసీ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ఉన్నంత కాలం ఈసీకి పవర్స్ ఉంటాయి. మొత్తం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే.. కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.