హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్మించబోయే రాజధాని ‘అమరావతి’ నగర ఊహాచిత్రాలు ఏపీ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఆకాశ హర్మ్యాలు, విశాలమైన రహదారులు, ఆకాశమార్గంలో దూసుకుపోయే మెట్రో రైల్ మొదలైనవి ఈ చిత్రాలలో కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలనుబట్టి చూస్తే అమరావతి ప్రపంచంలోని అత్యాధునిక నగరాలను తలదన్నేలా ఉంటుందనిపిస్తోంది.
మరోవైపు అమరావతి ఎలా వుండాలో మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. 20వ తేదీన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తన బృందంతో రాజమండ్రి లో సీడ్ మాస్టర్‌ప్లాన్ డిజైన్‌ను చంద్రబాబుకు అందిస్తారు. ప్లాన్ రూపొందించడానికి సింగపూర్ సంస్ధలకు ఏడాది పట్టింది. ఈ ప్లాన్ ఆధారంగా నిర్మాణాలు జరగాలి. నిర్మాణాల డిజైన్లు రూపొందించి, నిర్మాణవ్యయం తోసహా ముందుకి వచ్చేవారికోసం ప్రపంచవ్యాప్తంగా టెండర్లు పిలుస్తారు. ఆందులో ఎంపిక చేసిన డిజైన్లపై రేటు విషయంలో మళ్ళీ టెండర్లు పిలుస్తారు. స్విస్ ఛాలెంజింగ్ అనే ఈ టెండరింగ్ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ప్రపంచ స్ధాయి నిర్మాణాలు జరిపించాలన్నది తన ఆలోచన అని ముఖ్యమంత్రి ఒక ప్రిపరేటరీ మీటింగ్ చెప్పారు. సింగపూర్ ప్రతినిధుల వసతిసౌకర్యాల గురించి వారికి పుష్కరశోభను చూపించే ప్రదేశాల గురించి ఈ సమావేశంలో అధికారులకు బాధ్యతలు కేటాయించారు.
మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్ధలు వారు నిర్మాణాలకు కూడా టెండర్లువేస్తారు. అయితే జపాన్, చైనా దేశాల వర్క్ కల్చర్, క్వాలిటీ ఆధునికత బాగుంటాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఆదేశాల సంస్ధలు అమరావతి నిర్మాణంలో పాల్గొనే వాతావరణాన్ని కల్పించడమే ముఖ్యమంత్రి పర్యటనల్లో ఒకప్రయోజనమని అర్ధమౌతోంది.
అయితే స్విస్ ఛాలెంజ్ పద్దతిలో తుది టెండర్లు ఏడాది లో ఖరారయితే తొందరగా పని అయినట్టేనంటున్నారు. ఈ నేపధ్యంలో అమరావతి నిర్మాణం 2016 లో మొదలయ్యే అవకాశాలు చాలా తక్కువే!