నేడు జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై సస్పెన్స్ నెలకొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ కేబినెట్ సమావేశానికి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి రిప్లై లేకపోవడంతో మంత్రివర్గ సమావేశంపై సందిగ్ధత నెలకొంది. రెండు రోజుల కిందట ఈసీకి ప్రభుత్వ వర్గాలు కేబినెట్ సమావేశంకు సంబంధించి లేఖ రాసిన ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి రిప్లై లేదు. అయితే, ఈ మధ్యాహ్నంలోపు ఈసీ నుంచి రిప్లై వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో ప్రభుత్వ విజ్ఞప్తిపై ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మంత్రివర్గ సమావేశంపై ఈసీ నుంచి ఎలాంటి రిప్లై లేకపోతే మంత్రివర్గ సమావేశానికి బదులుగా సమీక్ష సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ళు, రైతు రుణమాఫీ, జూన్ 2న నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు, కేబినెట్ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.
ఎలక్షన్ కోడ్ తో మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉండటంతో రెండు రోజుల కిందటే ప్రభుత్వ వర్గాలు ఇందుకు సంబంధించి ఈసీకి లేఖ రాయగా దీనిని కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎటు తేల్చకపోవడంతో సీఈసి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.