బుల్లి తెర ప్రేక్షకులు దిగ్బ్రాంతిలో ఉన్నారు. కారణం త్రినయని సీరియల్ యాక్టర్స్ వరుసగా ఈ లోకం వీడి వెళ్లిపోవడమే. మొదట ఈ సీరియల్ లో కీలక పాత్ర పోషించిన పవిత్రా జయరాం యాక్సిడెంట్ లో మరణించారు. ప్రేక్షకులు ఆ షాక్ నుంచి బయట పడేలోగా, అదే సీరియల్ లో నటించిన చంద్ర కాంత్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. పవిత్రా జయరాం కారు ప్రమాదానికి గురైనప్పుడు, అదే కారులో చందు కూడా ప్రయాణించారు. స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే.. ఇదే ప్రమాదంలో పవిత్ర మరణించారన్న విషయాన్ని చందు తట్టుకోలేకపోయారు. ఐదారేళ్లుగా పవిత్ర, చంద్రకాంత్ సహజీవనంలో ఉన్నారు. ఈ క్రమంలో పవిత్ర మరణాన్ని భరించలేక చందు కూడా బలవన్మరణానికి పూనుకొన్నాడని తెలుస్తోంది. చంద్రకాంత్ కు ఇది వరకే పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్రినయని సీరియల్ సమయంలో పవిత్ర తో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పవిత్రకి కూడా పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. కొన్ని లీగల్ ఇష్యుస్ ఉన్నందు వలన వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు.
చందు భార్య శిల్ప మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. చందు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, చాలా అన్యోన్యంగా ఉండేవారమని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. మొదట సీరియల్స్ లో ఆఫర్స్ తానే ఇప్పించానని, వరుసగా ఆఫర్స్ వచ్చాయని కానీ త్రినయని సీరియల్ నుంచి తనకి కష్టాలు మొదలయ్యాయని, పవిత్ర వలన తన భర్త మారిపోయాడని, పూర్తిగా తమని వదిలేసాడని, ఆమెతోనే కలిసి ఉంటున్నాడని, ఆమె పిచ్చిలో బతుకుతున్నాడని వాపోయారు. ఆమె పై పెంచుకున్నప్రేమే చందుని అలాంటి నిర్ణయం తీసుకునేలా చేసిందని భావోద్వేగానికి గురి అయ్యారు.
పవిత్ర సడెన్ గా చనిపోవడంతో అది జీర్ణించుకోలేని చందు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని, అతని సోషల్ మీడియా పోస్టుల ద్వారా అర్థం అవుతోంది. ఆమెని తల్చుకుంటూ ”పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా” అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు. మరోవైపు పవిత్ర మరణానికి చందూనే కారణమంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం చందూని దారుణంగా ట్రోల్ చేసింది. ఇది కూడా చందూ తట్టుకోలేకపోయారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.