అల్లర్లతో ఏపీ అట్టుడుకుతుంటే సీఎంగా తన బాధ్యతను జగన్ రెడ్డి విస్మరించి విదేశాలకు వెళ్ళగా… ఇప్పుడు ఆ బాధ్యతలను చంద్రబాబు నిర్వర్తిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్ళడంతో చంద్రబాబు సీఎం రోల్ పోషిస్తున్నట్టుగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షలు నిర్వహిస్తూ గవర్నర్ తోపాటు ఎన్నికల కమిషన్ కు చంద్రబాబు వరుసగా లేఖలు రాస్తున్నారు.
హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు. దీంతో ఈసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాలపాటు కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉంచాలని కేంద్ర హోంశాఖకు సూచించింది.
అలాగే, సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చి వైసీపీ సర్కార్ తాత్సారం చేస్తోంది. పైగా, సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో చంద్రబాబు వైసీపీ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు గవర్నర్ కు లేఖ రాశారు. లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేయాలని చంద్రబాబు కోరగా గవర్నర్ ఆదేశాలతో ఆ నిధులు విడుదలయ్యాయి.
మరోవైపు జీవోలను దాచుకునేలా ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను ప్రారంభించడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని, తక్షణం ఆ ప్రక్రియని నిలిపివేయాలని కోరగా ఈసీ ఆ ప్రక్రియని నిలిపి వేసింది.
దీంతో చంద్రబాబు ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీ పడరని చెప్పేందుకు తాజా పరిణామాలే ఉదాహరణ అని ప్రచారం చేస్తున్నారు.