టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు టీమిండియా మాజీ ఆటగాళ్ల పేర్లు తెరమీదకు వచ్చినా తాజాగా గౌతమ్ గంభీర్ పేరు చర్చకు రావడం పలు సందేహాలకు తావిస్తోంది.
ద్రవిడ్ అనంతరం టీమిండియా కోచ్ గా గంభీర్ కు బాధ్యతలు అప్పగించాలనే ఢిల్లీ ఈస్ట్ ఎంపీగానున్న ఆయనను పోటీ నుంచి బీజేపీ తప్పించిందా..? అని స్పోర్ట్స్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీగానున్న గంభీర్ తనే ఈసారి పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నానని అప్పట్లో ప్రకటించినా… తాజాగా టీమిండియా కోచ్ గా పరిశీలనలో గంభీర్ పేరు ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, గంభీర్ పేరు పరిశీలనలో ఉందని ముందుగానే గ్రహించి విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్ పై కామెంట్స్ చేస్తున్నారా..? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే, గంభీర్ – కోహ్లీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఐపీఎల్ లో ఓసారి మైదానంలోనే ఇద్దరూ చేయి చేసుకునే స్థాయికి కూడా వెళ్ళారు. వీటన్నింటి నేపథ్యంలో గంభీర్ పేరు కోచ్ గా పరిశీలనలో ఉందని తెలిసే కోహ్లీ ఇటీవల రిటైర్ మెంట్ పై వ్యాఖ్యలు చేసి ఉండొచ్చునని విశ్లేషిస్తున్నారు.